
భువనేశ్వర్ : ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన రెండు నెలలకే అదృశ్యమైన మహిళ.. ఏడేళ్ల తర్వాత కనిపించింది. అయితే ఈ కేసులో ఆమె భర్త ఆమెను చంపేశాడన్న కారణంతో నెలరోజులు జైలు జీవితం అనుభవించడం గమనార్హం. ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లాకు చెందిన అభయ్ సుతారా అనే యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన ఇతిశ్రీ మొహరానాతో 2013లో వివాహమైంది. పెళ్లయిన రెండు నెలలకే ఇతిశ్రీ ఇంటి నుంచి అదృశ్యమైంది. చదవండి: నేను బాగా మందేస్తా, అదేమైనా నేరమా: నటి
ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆమె తండ్రి ప్రహ్లాద్ తన కూతురిని అల్లుడు అభయ్ వరకట్నం కోసం వేధించి చంపేశాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. తనకు భార్య అదృశ్యం కావడానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. అయితే నెలరోజులు తర్వాత ఆమెకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో అభయ్‌ని బెయిల్‌పై విడుదల చేశారు. చదవండి: అన్ని పూర్తయ్యాయి, ఇక మిగిలింది ఉరే
ఎలాగైనా తనమీద ఉన్న హంతకుడు అనే నింద పోగోట్టుకోవాలని.. అప్పటి నుంచి భార్యను వెతకడం ప్రారంభించాడు. ఏడు సంవత్సరాల తర్వాత పూరి జిల్లాలోని పిపిలీ ప్రాంతంలో ఇతిశ్రీ కనిపించింది. దీంతో వెంటనే అభయ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆమెను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. పెళ్లికి ముందే రాజీవ్ లోచన్ మహారాణా అనే యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులు అతనితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అభయ్‌ని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లయిన రెండు నెలలకు రాజీవ్‌తో కలిసి కోల్‌కతా పారిపోయినట్లు తెలిపింది. అయితే అభయ్ మాత్రం హంతకుడు అనే ముద్రను తొలగించుకోవడానికి ఏడు సంవత్సరాలు ప్రయత్నించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment