
పలు దొంగతనాలకు పాల్పడిన జార్ఖండ్ ముఠా సభ్యులు
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): నగరంలో వివిధ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్ప డిన జార్ఖండ్ ముఠాతో కలిపి 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 33 కేసుల్లో వీరంతా నిందితులు. వీరి నుంచి 541 గ్రాముల బంగారం, 417 గ్రాముల వెండితో పాటు పోలీస్ కానిస్టేబుల్ యూనిఫాం, ఆటోలు, మోటార్ బైక్‌లు, కార్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం విలువ రూ.35,11,800 ఉంటుంది. కమిషనరేట్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా ఈ కేసుల వివరాలను వెల్లడించారు.
బావ, బావమరిది అరెస్ట్
అల్లిపురం హరిజనవీధిలోని ఓ అద్దె ఇంట్లో తల్లితో పాటుగా కరాయ సురేష్ నివాసం ఉంటున్నాడు. ఇతను పెయింటర్. ఫోర్తుటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి రైల్వే న్యూ కాలనీ చెందిన స్వర్ణపూడి రోజా ఇంట్లో పెయింటింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. నవంబర్ 16న అదే ఇంట్లో డ్రెసింగ్ రూంలో ఉన్న బ్యాగ్‌లోని 10.5 తులాల బంగారం దొంగలించాడు. ఆ బంగారాన్ని తన బావమరిది నెల్లిరాజుకు ఇచ్చాడు. అతను జ్ఞానాపురంలోని ఓ గది అద్దెకు తీసుకుని.. ఈ బంగారాన్ని దాచి పెట్టారు. ఈ సమాచారం అందుకున్న క్రైం సీఐ కృష్ణారావు.. ఎస్‌ఐ వెంకటరావు సిబ్బందితో సురేష్, నెల్లిరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 126 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
జువైనల్ హోంకు ముగ్గురు తరలింపు
గాజువాక పోలీస్‌స్టేషన్(క్రైం) పరిధిలో నేరం ఆపాదించబడిన బాలలు చెడు వ్యసనాలకు అలవాటు పడి గాజువాక, న్యూపోర్టు, అన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిని క్రైం సీఐ పైడపనాయుడు తన సిబ్బందితో పట్టుకుని జువైనల్ హోంకు తరలించారు. గతంలో జువైనల్ హోంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీపావళి రోజున గాజువాకలోని అశోక్‌నగర్‌లో ఓ ఇంటి తాళం పగులకొట్టి.. బీరువాలో ఉన్న 4 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి పట్టీలు దొంగలించారు. ఎస్‌ఐలు జి.తేజేశ్వరరావు, దామోదర్‌లు వీరిని పట్టుకుని జువైనల్ హోంకు తరలించారు.
కానిస్టేబుల్ కుమారుడు అరెస్ట్
రూరల్ ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ కుమారుడు గొర్లె సంతోష్‌కుమార్‌ది జీకే వీధి మండలం, జేర్ల గ్రామం. డాబాగార్డెన్స్‌లోని ఒకేషనల్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదివే సమయంలో చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. స్నేహితుడు ములపర్తి వెంకటేష్‌తో కలసి ద్వారకాజోన్, ఎంవీపీ జోన్, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. సంతోష్‌కుమార్ మొత్తం 10 కేసుల్లో నేరాలు చేశాడు. 2014–15లో ఎంవీపీజోన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు చోట్ల ల్యాప్‌టాప్ దొంగతనాలు చేశాడు. అతనిపై ఎంవీపీజోన్‌లో 7 కేసులు, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ 2, ద్వారకా జోన్‌లో ఒక కేసు నమోదైంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి10 గ్రాముల బంగారం, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.
కిడ్నాప్ కేసులో 8 మంది అరెస్ట్
ఆరిలోవ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కేసులో గొలగాని ఏసుకుమార్ ఫిర్యాదు మేరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో చినముషిడివాడ, సుజాతనగర్‌కు చెందిన ఆర్.కన్నబాబు అనే రౌడీ షీటర్ ఉన్నాడు. ఏసుకుమార్, అడపా ప్రసాద్‌లు స్నేహితులు. ప్రసాద్.. నారాయణరావు వద్ద కార్లు అద్దెకు తీసుకున్నాడు. ఇందుకు రూ.13 లక్షలు బాకీ పడ్డాడు. ఆ మొత్తం ప్రసాద్ ఎంతకీ ఇవ్వకపోవడంతో నారాయణరావు రౌడీషీటర్లు ఆకుల సురేష్, ఆర్.కన్నబాబును ఆశ్రయించాడు. రూ.13 లక్షలు రికవరీ చేస్తే రూ.3 లక్షలు ఇస్తానని వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 20 తేదీన రాత్రి అడపా ప్రసాద్‌ను రెండు కార్లలో 10 మంది కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో కన్నబాబు మద్యం మత్తులో పడిపోవడంతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో జీపీఎస్ ద్వారా ఆ కార్లు ఆనందపురం వైపు వెళ్తున్నాయని గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే హెడ్ కానిస్టేబుల్ అప్రమత్తమై ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో నిందితులు ఎటూ వెళ్లలేక పట్టుబడ్డారు. ఈ క్రమంలో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్, నాలుగు సెల్ ఫోన్లు, 10 కిలోల గంజాయి, రూ. 38 వేలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నేరాలు ఇలా..
♦ ఫోర్తుటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కేసులో నక్లెస్, నల్ల పూసలు, కడియాలు, చెవిదుద్దులు, రింగ్‌తో కలిపి 123 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
♦ ద్వారకా జోన్, ఎంవీపీ జోన్, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో పది కేసులకు సంబంధించి 10 గ్రాముల బంగారం, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు.
♦ గాజువాక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 47 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.
♦ కంచరపాలెం, దువ్వాడ, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో 3 కేసులో 8 మందిని అరెస్ట్ చేసి 186 గ్రాములు బంగారం, 300 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.
♦ గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో రెం డు కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి, 41 గ్రాముల బంగారం, పోలీస్ కానిస్టేబుల్ యూని ఫారం, ఐడీకార్డు స్వాధీనం చేసుకున్నారు.
♦ దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కేసుల్లో ఒకరిని అరెస్ట్ చేసి 134 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో 15 కేసుల్లో 7 గురిని అరెస్ట్ చేసి 10 మోటార్ బైక్‌లు, 5 ఆటోలు స్వాధీనం ♦
చేసుకున్నారు. మొత్తం 33 కేసుల్లో 24 మందిని అరెస్ట్ చేసి, రూ.35,11,800 సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ చోరీలు
కంచరపాలెం, దువ్వాడ, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు జార్ఖండ్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఒకే కుటుంబ సభ్యులు. ఆనంద్ సోబార్, భార్య జ్యోతి సోబార్, వీరి పెద్ద కుమారుడు భార్య రూభి, ఆమె కుమార్తె సరిత, రెండో కుమారుడు భిఖాస్ సోబార్, భార్య కిరణ్, మూడో కుమారుడు సరోజ్ సోబార్ భార్య నేహాలు పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ సమాచారంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వేలి ముద్రల ద్వారా మిగతా వారిని అరెస్ట్ చేశారు. వీరంతా ప్లాస్టిక్ సామాన్లు, బెలూన్లు, గాజులు అమ్ముతూ.. తలుపులు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. అనంతరం రిక్కీ నిర్వహించి చోరీలు చేస్తారు. వీరంతా జ్ఞానాపురం రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉండి నేరాలకు పాల్పడ్డారు. వీరి వద్ద నుంచి 186 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5.70 లక్షలు. నిందితులను వెస్ట్ సబ్ డివిజన్ క్రైం సీఐ డి.నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఆర్.హెచ్.ఎన్.వి.కుమార్, సిబ్బంది అరెస్ట్ చేశారు.