నరసరావుపేటటౌన్: తక్కువ ధరకు తమ సంస్థ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తుందని నమ్మబలికి ఓ ప్రముఖ సంస్థ ప్రతినిధి వ్యాపారులు, ప్రజలను దోచుకున్న ఘటన ఆదివారం వెలుగుచూసింది. లక్షల రూపాయలు చెల్లించిన వినియోగదారులు ఎన్నిరోజులైనా వస్తువులు రాకపోవడంతో చివరకు మోసపోయామని గ్రహించి లబోదిబోమంటూ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు రోడ్డులోని రిలయన్స్ జియో స్టోర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న రామ్ ప్రసాద్ తమ సంస్థ తక్కువ ధరకు ఏసీలు, రిఫ్రిజిరేటర్స్, సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, డేటా కేబుల్ ఇస్తుందని తెలుపడంతో నమ్మిన వినియోగ దారులు, పలు వ్యాపార నిర్వాహకులు నగదు చెల్లించి రశీదులు పొందారు. అయితే రోజులు గడుస్తున్నా గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు రాకపోవడంతో ఈ విషయంపై మేనేజర్‌ను ఆడుగగా, ఆయన కాలయాపన చేస్తూ వస్తున్నాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమర్లు ఆరా తియ్యగా సంస్థకు డబ్బులు చెల్లించలేదని తెలుసుకున్నారు. దీంతో పాటు ఇచ్చిన రశీదు కూడా నకిలీదని తెలుసుకొని బెంబేలెత్తిపోయారు. దీంతో అతన్ని పట్టుకొని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
రూ.10 లక్షల వరకు వసూలు
సుమారు 15 మంది కస్టమర్ల వద్ద పదిలక్షల రూపాయల వరకు వసూలు చేశారు. పట్టణంలోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ దుకాణ నిర్వాహకుడు రూ.5 లక్షలకు పైగా నగదు చెల్లించినట్లు తెలిసింది. అయితే కంపెనీ నిబంధనల ప్రకారం కస్టమర్లకు మాత్రమే తక్కువ ధరకు విక్రయించాల్సిన గృహోపకరణాలు, సెల్‌ఫోన్‌లు రిటైల్ వ్యాపారులకు బిల్లులు లేకుండా విక్రయించేందుకు బేరం కుదుర్చుకొని నగదు తీసుకున్నట్లు తెలియవచ్చింది. ఇలా రశీదు లేకుండా కొన్న కారణంగా కేసు పెట్టేందుకు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. ఈ విషయంపై సీఐ శివప్రసాద్‌ను వివరణ కోరగా కొంతమంది కస్టమర్లు డబ్బులు చెల్లించినా రిఫ్రిజిరేటర్స్, సెల్‌ఫోన్‌లు ఇవ్వడంలేదని రిలయన్స్ జియో స్టోర్ మేనేజర్‌పై ఫిర్యాదు చేశారన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment