
సిరాజ్ వార్తాపత్రిక జర్నలిస్టు కే ముహమ్మద్ బషీర్
తిరువనంతపురం: మద్యాన్ని సేవించి, అతివేగంతో కారు నడిపిన ఓ ఐఏఎస్ అధికారి, జర్నలిస్టు మృతికి కారణమయ్యాడు. ఈ ఘటన కేరళలో శనివారం జరిగింది. ఇందులో ప్రధాన నిందితుడైన ఐఏఎస్ శ్రీరామ్ వెంకటరమణ్ (33)ను ఇటీవలే రాష్ట్రప్రభుత్వం సర్వే డైరెక్టర్‌గా నియమించింది. పోలీసుల కథనం ప్రకారం.. వెంకటరమణ్ తన మిత్రురాలు, మోడల్ వాఫా ఫిరోజ్‌కు చెందిన లగ్జరీ కారును వేగంగా నడిపిస్తూ మ్యూజియం రోడ్డు వద్ద మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు. దీంతో దానిపై ప్రయాణిస్తున్న ‘సిరాజ్’ వార్తాపత్రిక యువ జర్నలిస్టు కే ముహమ్మద్ బషీర్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం ధాటికి వాహనాల విడి భాగాలు, ఇతర వస్తువులు ఘటనా స్థలానికి దూరంగా ఎగిరిపడ్డాయి. ఐఏఎస్‌పై కేసు నమోదు చేశామని ఐజీపీ, పోలీస్ కమిషనర్ ధినేంధ్ర కశ్యప్ అన్నారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.