
భర్త చేతిలో గాయపడిన లక్ష్మి
జగిత్యాల జిల్లా : కొండగట్టు సమీపంలో తండ్రి చేతిలో హత్యకు గురైన ఇద్దరు పిల్లల మృతదేహాలు మంగళవారం లభ్యమయ్యాయి. పిల్లలను హత్య చేసి భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామ శివారులోని బొగ్గులకుంట వద్ద సోమవారం జరిగిన సంగతి తెల్సిందే. వివరాలు..ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం శివపురి గ్రామానికి చెందిన నికోడ అశోక్ తన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం కొండగట్టు దర్శనానికి రైలులో వచ్చారు.
రాత్రి కొండగట్టులో నిద్రించి ఆదివారం మధ్యాహ్నాం భార్య పిల్లలను అశోక్ తన వెంట బొగ్గులకుంట వైపు తీసుకెళ్లాడు. అడ్డుచెప్పిన భార్యకు ఇక్కడ కోనేరు ఉందని స్నానం చేద్దామని నమ్మబలికాడు. అడవిలోకి వెళ్లిన తర్వాత ఏడాదిన్నర వయసున్న చిన్న కూతురు అక్షిత గొంతు నులిమి చంపాడు. వెంటనే పెద్దమ్మాయి అంజలి(4)ని చంపే ప్రయత్నంలో భార్య లక్ష్మి అడ్డుకోవడంతో ఆమె మెడకు వైరుతో బిగించి చంపే ప్రయత్నం చేశాడు. ఆ ఘటనలో లక్ష్మి కళ్లు తిరిగి పడిపోయింది. లేచి చూసేసరికి పెద్దపాప, భర్త కనిపించలేదు.
ఆదివారం రాత్రి 11 గంటల సమయానికి ఎలాగోలా రహదారికి చేరుకుని తల్లిదండ్రులకు, సోదరులకు సమాచారం ఇచ్చింది. వారి సహాయంతో సోమవారం వాంకిడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల సహాయంతో అడవిలో వెతకగా చిన్నారి అక్షిత శవం లభ్యమైంది. పెద్ద కూతురు అంజలి శవం కూడా మంగళవారం పరిసరాల్లోనే లభ్యమైంది. భార్యపై అనుమానం పెంచుకునిఈ హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment