లాహోర్ : ఏడేళ్ల చిన్నారి జైనబ్‌ని ఓ మానవ మృగం క్రూరంగా కబలించివేసిన ఘటన పాకిస్థాన్‌ను అట్టుడికిస్తోంది. రోజులు గడుస్తున్నా.. కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవటంతో పోలీసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని 36 గంటల్లో అరెస్ట్ చేసి తీరాలని శుక్రవారం లాహోర్ హైకోర్టు కసుర్ పోలీసులకు డెడ్ లైన్ విధించింది.
ఇప్పటికే ఒకరోజు గడిచిపోగా.. నేడు సీసీ పుటేజీ సాయంతో నిందితుడి ఊహాచిత్రాలను కసూర్ పోలీసులు విడుదల చేశారు. చిన్నారిని ఓ వ్యక్తి తీసుకెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం హై అలర్ట్ ప్రకటించిన అధికారులు.. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుని తీరతామని చెబుతున్నారు.
జనవరి 4న ఏడేళ్ల వయసున్న జైనబ్ అన్సారీ తన ఇంటికి దగ్గర్లో ఉన్న అత్త ఇంటికి వెళ్తుండగా అపహరణకు గురైంది. ఐదు రోజుల తర్వాత చెత్తకుప్పలో కూలీలు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు.. అతి పైశాచికంగా హింసించి చంపాడని వైద్యులు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడించారు. ఈ ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చిన్నారి అంత్యక్రియల్లో అశేష జనవాహిని పాల్గొంది.
ప్రజలు దేశవ్యాప్తంగా శాంతి ర్యాలీలు చేపట్టారు. ఇక గత ఏడాదిలో కసూర్‌లో ఇలాంటి కేసులు 12 నమోదు కావటంతో ప్రజల్లో ఆగ్రహాం తారాస్థాయికి చేరుకుంది. నిందితుడిని ఊరితీయాలంటూ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకతీతంగా ఆందోళన చేపట్టారు. పంజాబ్ ప్రొవిన్స్‌లో అది కాస్త హింసాత్మకంగా మారటంతో పోలీసులు కాల్పులు జరపగా.. ముగ్గురు మృతి చెందారు. దీంతో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. లాహోర్ హైకోర్టు కసూర్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గడువులోపు నిందితుడిని అరెస్ట్ చేయకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment