Lahore High Court
-
పాక్‌లో జిహాద్ పేరుతో నిధులు సేకరించొద్దు
లాహోర్: పాకిస్తాన్లో జిహాద్ పేరుతో నిధులను సేకరించేందుకు ప్రజలను ప్రేరేపించొద్దని, అలా ఎవరు చేసినా అది రాజద్రోహం కిందికి వస్తుందని లాహోర్ హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా యుద్ధాన్ని ప్రకటిస్తే అందుకు అవసరమైన డబ్బులు సేకరించడం దేశానికి సంబంధించిన పని అని వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ కోసం నిధులు సేకరించినందుకు దోషులుగా తేలి ఐదేళ్లు శిక్ష పడిన ఇద్దరు ఉగ్రవాదుల అప్పీళ్లను తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పు నిచ్చింది. ‘తెహ్రీకీ తాలిబాన్ నిషేధిత సంస్థ. దేశానికి ఎంతో నష్టం చేసింది. దేశ ముఖ్య నాయకులు లక్ష్యంగా పని చేసింది. దేశంలో ఉగ్రవాదం పెంచడానికి ప్రయత్నింది. ఆర్థికంగా మద్దతు లేనిదే ఇదంతా సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు అందించారంటూ ఈ నెలలో అరెస్టయిన ఇద్దరు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు యాంటీ టెర్రరిస్టు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. -
ముషారఫ్‌కు భారీ ఊరట
లాహోర్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు మరణ శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు.. అన్నీ చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. 2013లో నాటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసింది. ఆరేళ్ల పాటు ప్రత్యేక కోర్టు విచారణ జరిపి గత డిసెంబర్లో ముషారఫ్‌కు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటును, ఆ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం లాహోర్ హైకోర్టులోని జస్టిస్ సయ్యద్ మజహర్ అలీ అక్బర్ నఖ్వీ, జస్టిస్ మొహ్మద్ అమీర్ భట్టీ, జస్టిస్ చౌధరి మసూద్ జహంగీర్ల త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ముషారఫ్‌పై నమోదైన దేశద్రోహం కేసు కూడా చట్టప్రకారం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘కేసు నమోదు నుంచి ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం వరకు అన్నీ రాజ్యాంగ వ్యతిరేకమని లాహోర్ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది’ అని పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ ఇష్తియాక్ ఖాన్ తెలిపారు. ఈ తీర్పుతో జనరల్ ముషారఫ్‌కు స్వేచ్ఛ లభించిందన్నారు. కాగా, లాహోర్ హైకోర్టు తీర్పుపై జనరల్ ముషారఫ్ హర్షం వ్యక్తం చేశారు. -
నవాజ్ షరీఫ్‌కు బెయిల్
లాహోర్: అనారోగ్యంతో బాధపడుతున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఆయన రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య ప్రమాదకర స్థా యికి తగ్గడంతో సోమవా రం రాత్రి ఆయనను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూ రో(ఎన్ఏబీ) కార్యాల యం నుంచి లాహోర్‌లోని సర్వీసెస్ ఆసుపత్రికి తరలించారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ అధినేత అయిన నవాజ్ షరీఫ్ అనారోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తక్షణమే బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సోదరుడు షాబాజ్ పెట్టుకు న్న పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు శుక్రవారం విచారించింది. అనంతరం రూ.రెండు కోట్ల విలువైన రెండు సొంత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. నగదు అక్రమ చెలామణీ కేసులో షరీఫ్ ఎన్ఏబీ అదుపులో ఉన్నారు. -
నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమం
లాహోర్ : పనామా పేపర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లాహోర్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యం కారణంగా మెడికల్ పర్మిటెన్స్ కింద నవాజ్ షరీఫ్‌కు లాహోర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు అధికారులు షరీఫ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నవాజ్ షరీఫ్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. -
క్రిస్టియన్ మహిళ కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు
ఇస్లామాబాద్ : దైవ దూషణ చేసిన క్రిస్టియన్ మహిళపై పాకిస్తాన్ సుప్రీం కోర్టు కనికరం చూపింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ చీఫ్ జస్టిస్ సాఖిబ్ నిసార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివరాలు.. క్రిస్టియన్ మతానికి చెందిన అసియా బీబీ ఇస్లాం మతాన్ని దూషిస్తూ తరచూ ఇరుగుపొరుగు వారితో గొడవకు దిగేది. తమ మతంపై అసియా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇస్లాంను దూషించిన అసియాకు బతికే అర్హత లేదనీ.. ఆమెకు కఠిన శిక్ష విధించాలని 2009లో కోర్టును ఆశ్రయించారు. అసియాకు ఉరిశిక్ష పవిత్ర ఇస్లాం మతాన్ని దూషించి ప్రజల మనోభావాల్ని దెబ్బతీశావంటూ లాహోర్ హైకోర్టు 2010లో అసియాకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై పాకిస్తాన్ వ్యాప్తంగా కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా.. మరికొందరు ఆమెకు పాపం పండిందని ఆనందం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై అసియా సుప్రీం కోర్టును ఆశ్రయించిగా.. నిందితురాలు గత ఎనిమిది సంవత్సరాలుగా ‘ఏకాంతవాస’శిక్షను అనుభవిస్తుండడంతో కోర్టు ఆమెకు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఇదిలాఉండగా.. ఈ కేసుపై మూడు వారాల క్రితమే కోర్టు నిర్ణయం తీసుకుందనీ, అయితే నిరసనలను అదుపు చేసేందుకు తీర్పును రిజర్వులో ఉంచారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆయన మరణంతో అలజడి.. అసియాకు ఉరిశిక్ష విధించిన లాహోర్ హైకోర్టు వ్యవహారాన్ని ఖండించి, ఆమెకు మద్దతుగా నిలిచిన పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ 2011లో హత్యకు గురికావడంతో పాకిస్తాన్లో అలజడి రేగింది. ఈ నేపథ్యంలోనే అసియా కేసులో కోర్టు జాగ్రత్తలు చేపట్టింది. నిరసనలు చెలరేగకుండా పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదేమైనా ఇస్లాం నిరసనకారుల వల్ల అసియాకు ఇబ్బందులు తప్పక పోవచ్చుననీ, జైలు నుంచి విడుదలైన అనంతరం ఆమె రక్షణ ప్రమాదంలో పడొచ్చననే భయాలు నెలకొన్నాయయి. ఉగ్రవాదులు ఆమెపై దాడికి పాల్పడవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా.. అప్పటి ప్రధాని జియావుల్ హక్ 1980లో దైవ దూషణ నేరంగా పరిగణించే చట్టాలు తెచ్చారు. అయితే, వ్యక్తిగత కక్ష్యసాధింపు చర్యలకు ఈ చట్టాలు అవకాశం కల్పిస్తాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
షరీఫ్ కోర్టుకు రావాల్సిందే
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మరో షాక్ తగిలింది. ఇటీవలే అక్రమాస్తుల కేసులో ఊరట పొందిన షరీఫ్‌ను.. లాహోర్ హైకోర్టు రాజద్రోహం కేసులో అక్టోబర్ 8వ తేదీన న్యాయస్థానంలో హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఓ ఇంటర్వ్యూలో ముంబై దాడుల గురించి మాట్లాడినందకు ఆయనపై రాజ్యద్రోహం కేసు నమోదైంది. ఈ ఏడాది మేలో ఆయన డాన్ పత్రికతో మాట్లాడుతూ.. ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని పరోక్షంగా అంగీకరించారు. దాడులకు పాల్పడింది పాక్ ఉగ్రవాదులేనని తెలిపారు. పాక్‌లో ఉగ్రవాదులు కదలికలు ఎక్కువగానే ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై అమీన్ మాలిక్ అనే మహిళ కోర్టును ఆశ్రయించారు. ‘2017లో సుప్రీం కోర్టు షరీఫ్‌ను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటించింది. అక్రమాస్తుల కేసులో కోర్టు ఆయనకు పదేళ్లు జైలు శిక్ష విధించింది. అయినా ముంబై దాడులో పాక్ ప్రమేయం ఉందని మాట్లాడి షరీఫ్ దేశద్రోహానికి పాల్పడ్డాడ’ని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన లాహోర్ హైకోర్టు ఈ కేసులో డాన్ జర్నలిస్టు సిరిల్ ఆల్మైడాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కానీ అతడు కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 8న అతన్ని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పంజాబ్ డీఐజీని ఆదేశించింది. షరీఫ్ కోర్టుకు హాజరుకాకపోవడంపై కూడా ఆయన న్యాయవాది నాసిర్ భుట్టోను ప్రశ్నించింది. దీనికి నాసిర్ ఆయన తదుపరి వాయిదాకు హాజరవుతారని తెలిపారు. భార్య చనిపోవడం వల్ల ఆయన బాధలో ఉన్నట్టు వివరించారు. అక్రమాస్తులు కేసులో శిక్షలు అనుభవిస్తున్న షరీఫ్‌తోపాటు, ఆయన కుటుంబసభ్యులకు విధించిన జైలు శిక్ష రద్దు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు గతవారం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. -
హఫీజ్ సయీద్‌ను వేధించొద్దు: పాక్ కోర్టు
లాహోర్: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, హఫీజ్ సయీద్‌ను వేధించవద్దంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆయన తన సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించడానికి వీలు కల్పించాలని సూచించింది. ఇదే కోర్టు గత నవంబర్‌లో హఫీజ్ సయీద్‌కు గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించింది. తన సామాజిక సేవా సంస్థలు జమాత్–ఉద్–దవాహ్ (జేయూడీ), ఫలాహ్–ఐ–ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)లను పాక్ ప్రభుత్వం నిషేధించడాన్ని సవాలు చేస్తూ లాహోర్ హైకోర్టులో సయీద్ పిటిషన్ వేశారు. -
ఇంకా 12గంటలే మిగిలి ఉంది
లాహోర్ : ఏడేళ్ల చిన్నారి జైనబ్‌ని ఓ మానవ మృగం క్రూరంగా కబలించివేసిన ఘటన పాకిస్థాన్‌ను అట్టుడికిస్తోంది. రోజులు గడుస్తున్నా.. కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవటంతో పోలీసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని 36 గంటల్లో అరెస్ట్ చేసి తీరాలని శుక్రవారం లాహోర్ హైకోర్టు కసుర్ పోలీసులకు డెడ్ లైన్ విధించింది. ఇప్పటికే ఒకరోజు గడిచిపోగా.. నేడు సీసీ పుటేజీ సాయంతో నిందితుడి ఊహాచిత్రాలను కసూర్ పోలీసులు విడుదల చేశారు. చిన్నారిని ఓ వ్యక్తి తీసుకెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం హై అలర్ట్ ప్రకటించిన అధికారులు.. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుని తీరతామని చెబుతున్నారు. జనవరి 4న ఏడేళ్ల వయసున్న జైనబ్ అన్సారీ తన ఇంటికి దగ్గర్లో ఉన్న అత్త ఇంటికి వెళ్తుండగా అపహరణకు గురైంది. ఐదు రోజుల తర్వాత చెత్తకుప్పలో కూలీలు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు.. అతి పైశాచికంగా హింసించి చంపాడని వైద్యులు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడించారు. ఈ ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చిన్నారి అంత్యక్రియల్లో అశేష జనవాహిని పాల్గొంది. ప్రజలు దేశవ్యాప్తంగా శాంతి ర్యాలీలు చేపట్టారు. ఇక గత ఏడాదిలో కసూర్‌లో ఇలాంటి కేసులు 12 నమోదు కావటంతో ప్రజల్లో ఆగ్రహాం తారాస్థాయికి చేరుకుంది. నిందితుడిని ఊరితీయాలంటూ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకతీతంగా ఆందోళన చేపట్టారు. పంజాబ్ ప్రొవిన్స్‌లో అది కాస్త హింసాత్మకంగా మారటంతో పోలీసులు కాల్పులు జరపగా.. ముగ్గురు మృతి చెందారు. దీంతో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. లాహోర్ హైకోర్టు కసూర్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గడువులోపు నిందితుడిని అరెస్ట్ చేయకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. -
జైనబ్ కేసు: సీసీ పుటేజీ
-
గృహనిర్భంధం నుంచి హఫీజ్‌కు విముక్తి?
-
గృహనిర్బంధం నుంచి హఫీజ్‌కు విముక్తి?
లాహోర్ : హఫీజ్ సయీద్ విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం పరోక్షంగా సహకారం అందిస్తోంది. ఇందుకు లాహోర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2008 ముంబై దాడులకు మాస్టర్‌మైండ్ అయిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి హఫీజ్ సయీద్ పాత్రపై సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించకపోతే గృహనిర్భంధం నుంచి ఆయన్ను విడుదల చేయాల్సి వస్తుందని లాహోర్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. ముంబై దాడులకు సంబంధించి హఫీజ్ సయీద్ ఈ ఏడాది జనవరి 31 నుంచి గృహనిర్భంధాన్ని పాక్ ప్రభుత్వం విధించింది. అయితే ప్రభుత్వ నిర్భంధంపై హఫీజ్ సయీద్ లాహోర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై పాకిస్తాన్ అంతర్గత భద్రతా కార్యదర్శి స్పందిస్తూ.. ఇందుకు సంబంధించిన ఆధారాలను గతంలో కోర్టును సమర్పించినట్లు తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. దేశంలో ఏ పౌరుడు కేవలం కొన్ని వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్తలతో గృహనిర్భంధాన్ని విధించడం సరికాదని పేర్కొంది. -
కోహినూర్ కాంట్రవర్సీ: హైకోర్టు కీలక ఉత్తర్వులు
'కోహినూర్ డైమండ్ ను బ్రిటిషర్లు మన దేశం నుంచి కొల్లగొట్టారని అంటున్నారు. ప్రభుత్వం మాత్రం దాన్ని ఎవ్వరూ ఎత్తుకెళ్లలేదు.. బహుమతిగా ఇచ్చాం అంటోంది. 1849లో లాహోర్ ఒప్పందంలో భాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి వజ్రాన్ని బహుమతిగా ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. పరిశీలించాల్సిన అంశమేమంటే..అసలు ఒక కంపెనీకి, రాజుకు మధ్య జరిగిన ఒప్పందం ఇప్పుడు చెల్లుబాటు అవుతుందా? అసలు అవిభాజ్య పంజాబ్ లో ఎలాంటి నిబంధనలు అమలయ్యాయి? వాటి ప్రకారం కోహినూర్ వజ్రం ఈస్ట్ ఇండియాకు ఇవ్వడం సరైందేనా? ఈస్టిండియాతో ఇక్కడి వాళ్లు ఏమేం ఒప్పందాలు చేసుకున్నారు? వీటికి సంబంధించిన సమగ్రసమాచారాన్ని మాకు ఇవ్వండి' అంటూ కోహినూర్ వజ్రం విషయంలో లాహోర్ హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. 'కోహినూర్ పాకిస్థాన్ దే..' ప్రపంచఖ్యాతి పొందిన కోహినూర్ వజ్రం పాకిస్థాన్ కే చెందుతుందని, ప్రస్తుతం బ్రిటిష్ రాజవశస్తుల నివాసం 'టవర్ ఆఫ్ లండన్'లో ఉన్న కోహిన్ వజ్రాన్ని పాక్ కు తిరిగి తెప్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఒక వ్యక్తి లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు. దానిని విచారణకు స్వీకరించిన కోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం కోర్టుకు సమాధానం ఇస్తూ.. 'లాహోర్ ఒప్పందంలో భాగంగా కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ కు బహుమానంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనికి పిటిషనర్.. దులీప్ సింగ్, ఈస్టిండియాల మధ్య జరిగిన ఒప్పందం చెల్లుబాటుకాదని వాదించారు. కామన్ వెల్త్ సభ్యుడిగా పాక్ మళ్లీ కోహినూర్ ను పొందే అవకాశం ఉంటుందని, ఆమేరకు ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు పాత ఒప్పందాలన్నింటినీ సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోహినూర్ మాదేనంటూ భారత్, పాకిస్థాన్ లేకాక ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ లు కూడా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ కోహినూర్ ప్రస్థానం.. గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనులులో ఈ ప్రఖ్యాత వజ్రం లభించింది. మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తారు. తర్వాతికాలంలో కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. క్రీస్తు శకం 1310లో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు.. ఢిల్లీ సుల్తాన్‌తో సంధి చేసుకున్న సమయంలో అపార సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా సమర్పించుకున్నాడు. 1526లో ఈ వజ్రం మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ వశం అయి.. బాబర్ వజ్రంగా పేరు పొందింది. మొఘల్ సామ్రాజ్యం ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో నాదిర్ షా దీన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అది నెరవేరలేదు గానీ దానిని చూసే భాగ్యం మాత్రమే ఆయనకు దక్కింది. నిజానికి కోహినూర్ కు ఆ పేరు (కోహ్-ఇ-నూర్ అంటే కాంతి శిఖరం) పెట్టింది కూడా నాదిర్ షాయే. 1840లో నాటి అవిభక్త పంజాబ్ లో జరిగిన సిక్కుల యుద్ధంలో తనకు సహకించినందుకుగానూ దులీప్ సింగ్ అనే రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడని కొందరు చెబుతారు. అయితే దులీప్ నుంచి ఆ వజ్రాన్ని బ్రిటిషర్లు కొట్టేశారని మరొకొందరు వాదిస్తారు. ఏదిఏమైనప్పటికీ 1913లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ద్వారా ఈ వజ్రం విక్టోరియా రాణికి బహుమతిగా వెళ్లింది. అప్పటి నుంచి లండన్‌లోనే ఉండిపోయిన కోహినూర్ ను తిరిగి తేలేమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పంది. -
కోహినూర్ పిటిషన్ స్వీకరించిన పాక్ కోర్టు
లాహోర్: కోహినూర్ వజ్రంపై పిటిషన్‌ను పాకిస్తాన్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వజ్రాన్ని బ్రిటిన్ నుంచి తిరిగి తెప్పించే విషయమై పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు అంగీకరించింది. బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 కిరీటంలో ఉన్న కోహినూర్‌ను పాకు తేవాలని జావెద్ ఇక్బాల్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు విచారించింది. -
85 ఏళ్ల తర్వాత భగత్‌సింగ్ కేసు విచారణ
లాహోర్: బ్రిటీష్ పోలీసు అధికారి శాండర్స్ హత్యకేసులో విప్లవవీరుడు భగత్ సింగ్ నిర్దోషి అంటూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం నుంచి లాహోర్ హైకోర్టు విచారించనుంది. పాక్‌లోని భగత్ స్మారక ఫౌండేషన్ చైర్మన్, అడ్వకేట్ ఇంతియాజ్ రషీద్ ఖురేషి ఈ పిటిషన్ వేశారు. ‘శాండర్స్ కేసులో గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత భగత్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులపై నేరం మోపారు. ఈ కేసులో వీరు జీవితఖైదు అనుభవిస్తుండగానే.. కావాలనే వేరే కేసులో ఇరికించి వీరికి ఉరిశిక్ష అమలు చేశారు’ అని ఖురేషి పేర్కొన్నారు. -
ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీ విడుదల
లాహోర్: పాకిస్థాన్ జైలులో ఉన్న ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తాయిబా ఆపరేషన్స్ కమాండర్ లఖ్వీని విడుదల చేశారు. లఖ్వీపై నిర్బంధాన్ని రద్దు చేసి, తక్షణమే విడుదల చేయాలన్న లాహోర్ హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం రాత్రి పాక్ అతన్ని విడుదల చేసింది. కాగా లఖ్వీని విడిచి పెట్టరాదని భారత్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా, పాక్ పట్టించుకోలేదు. 2008 నవంబర్‌లో భారత వాణిజ్య రాజధాని ముంబైపై దాడి కేసులో లఖ్వీ ప్రధాన సూత్రధారి అన్న విషయం తెలిసిందే. 2009 ఫిబ్రవరిలో లఖ్వీతోపాటు మరో ఆరుగురిని పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాడి జరిగిన సమయంలో తీవ్రవాద సంస్థ లష్కరే ఈ తోయిబాకు లఖ్వీ అపరేషనల్ హెడ్‌గా ఉన్నాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముంబైలో 26/11 దాడిలో 166 మంది మరణించారు. -
లఖ్వీని విడుదల చేయండి: పాక్ కోర్టు
లష్కరే తాయిబా ఆపరేషన్స్ కమాండర్, 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి జకీ ఉర్ రహమాన్ లఖ్వీపై నిర్బంధాన్ని రద్దుచేసి, తక్షణమే అతణ్ని విడుదల చేయాలని లాహోర్ హైకోర్టు గురువారం పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి మహ్మద్ అన్వర్ ఉల్ హక్ తీర్పును వెలువరిస్తూ,, పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద లఖ్వీని నిర్బంధించిన పంజాబ్ ప్రభుత్వం అతనిని దోషిగా నిరూపించే సాక్ష్యాధారాల్ని సమర్పించలేకపోయినందున నిర్బంధాన్ని ఎత్తివేస్తూ విడుదలకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకొక్కటి రూ.10 లక్షల విలువైన రెండు సెక్యూరిటీ బాండ్లను పూచికత్తుగా సమర్పించాలని లఖ్వీ తరఫు న్యాయవాదికి సూచించారు. కావాలసిన ఆధారాలన్నింటిని సమర్పించినప్పటికీ కోర్టు తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా లఖ్వీ విడుదలకు మొగ్గుచూపిందని హైకోర్టు ఉన్నతాధికారులు చెప్పారు. -
హైకోర్టు ఎదుటే పరువు హత్య
లాహోర్: తమ అభీష్టానికి విరుద్దంగా వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుందనే అక్కుసుతో పాకిస్థాన్ లో 25 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులే పాశవికంగా హత్య చేశారు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా కర్కశంగా కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. లాహోర్ హైకోర్టు ఎదుటే ఈ దారుణోదంతం చోటు చేసుకోవడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫైసలాబాద్ కు చెందిన ఫర్జానా పర్వీన్ కొన్ని నెలల క్రితం జరన్వాలాకు చెందిన మహ్మద్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని ఫర్జానా కుటుంబ సభ్యులు ఇక్బాల్ పై కిడ్నాప్ కేసు పెట్టారు. ఈ కేసు విషయమై కోర్టు వచ్చిన ఫర్జానాను ఇక్బాల్ నుంచి తీసుకుపోయేందుకు ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ముందుగా గాల్లోకి కాల్పులు జరిపి ఆమెను లాక్కేందుకు యత్నించారు. తమ ప్రయత్నం విఫలమవడంతో ఫర్జానా తండ్రి, సోదరుడితో 20 మంది కుటుంబ సభ్యులు వారిపై కర్రలు, ఇటుకలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఫర్జానా మృతి చెందగా, ఇక్బాల్ తప్పించుకున్నాడు. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ఫర్జానా తండ్రి, సోదరుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో దాదాపు 900 మంది మహిళలు పాకిస్థాన్ లో పరువు హత్యలకు బలైయ్యారని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.