హైకోర్టు ఎదుటే పరువు హత్య
లాహోర్: తమ అభీష్టానికి విరుద్దంగా వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుందనే అక్కుసుతో పాకిస్థాన్ లో 25 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులే పాశవికంగా హత్య చేశారు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా కర్కశంగా కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. లాహోర్ హైకోర్టు ఎదుటే ఈ దారుణోదంతం చోటు చేసుకోవడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
ఫైసలాబాద్ కు చెందిన ఫర్జానా పర్వీన్ కొన్ని నెలల క్రితం జరన్వాలాకు చెందిన మహ్మద్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని ఫర్జానా కుటుంబ సభ్యులు ఇక్బాల్ పై కిడ్నాప్ కేసు పెట్టారు. ఈ కేసు విషయమై కోర్టు వచ్చిన ఫర్జానాను ఇక్బాల్ నుంచి తీసుకుపోయేందుకు ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ముందుగా గాల్లోకి కాల్పులు జరిపి ఆమెను లాక్కేందుకు యత్నించారు. తమ ప్రయత్నం విఫలమవడంతో ఫర్జానా తండ్రి, సోదరుడితో 20 మంది కుటుంబ సభ్యులు వారిపై కర్రలు, ఇటుకలతో దాడి చేశారు.
ఈ ఘటనలో ఫర్జానా మృతి చెందగా, ఇక్బాల్ తప్పించుకున్నాడు. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ఫర్జానా తండ్రి, సోదరుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో దాదాపు 900 మంది మహిళలు పాకిస్థాన్ లో పరువు హత్యలకు బలైయ్యారని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.