సాక్షి, నెల్లూరు: కేసును ఉపసంహరించుకోమని ఓ మహిళను వామపక్ష పార్టీకి చెందిన నేత, మరికొందరు ఆమె భర్తతో కలిసి వివస్త్రను చేసి దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. గాయాలపాలైన ఆమె నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఈ ఘటన కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు న్యూ ఇందిరమ్మకాలనీలో బుధవారం జరిగింది. బాధితురాలి సమాచారం మేరకు.. ఇందిరమ్మకాలనీకి చెందిన అత్తులూరి సౌమ్య, ప్రదీప్ దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. సౌమ్య క్యాటరింగ్ పనులు చేసుకుంటుండగా, ప్రదీప్ ఆటోనడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు వేర్వేరుగా జీవిస్తున్నారు.
ఆమెపై కన్నేసిన వామపక్ష నేత..
అదే ప్రాంతానికి చెందిన వామపక్ష పార్టీకి చెందిన శ్రీహరి ఆమెపై కన్నేశాడు. అప్పటి నుంచి ఆమెను ఎలాగైనా లొంగ దీసుకోవాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్ 1వ తేదీ సౌమ్య పనులు ముగించుకుని నగరంలో నుంచి ఇంటికి వస్తుండగా అన్నమయ్య సర్కిల్ వద్ద ఆమెను అడ్డగించి బలవంతం చేయబోయాడు. ప్రతిఘటించిన బాధితురాలు అతని నుంచి తప్పించుకుంది. అప్పట్లో నాల్గోనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీహరిపై లైంగిక దాడియత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అనంతరం కేసును విచారణ నిమిత్తం ఎస్సీ, ఎస్టీ సెల్‌కు బదలాయించారు.
అంతుచూస్తామని బెదిరించాడు..
ఈ విషయమై శ్రీహరి కేసును రాజీ చేసుకోమని లేదంటే అంతు చూస్తామని బెదిరించసాగాడు. ఆమె నిరాకరించడంతో భర్త, అత్తమామల ద్వారా ఆమెపై ఒత్తిడి పెంచాడు. ఒక దశలో ఆమె ఇంటిపై దాడికి యత్నించగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పరారయ్యారు. అప్పటి నుంచి ఆమె పలుమార్లు స్థానిక నెల్లూరురూరల్ పోలీసులకు శ్రీహరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని రక్షణ కల్పించాలని అభ్యర్థించింది. అయినా వారు పెద్దగా పట్టించుకోలేదు. అందుకు శ్రీహరి తనకున్న పలుకుబడిని ఉపయోగించి పోలీసులపై ఒత్తిడి తేవడమే కారణం. దీంతో బాధితురాలు ఎస్పీని కలిసేందుకు వెళ్లగా ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగింది.
నీ భర్త పార్టీ ఆఫీసు వద్ద ఉన్నాడని..
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సౌమ్య టీ అంగడికి వెళ్లి వస్తుండగా నీ భర్త పార్టీ ఆఫీసు వద్ద ఉన్నాడని, అక్కడికి రమ్మని ఆమెను కొందరు పార్టీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ శ్రీహరి, సౌమ్య భర్త ప్రదీప్, మరికొందరు ఆమెను వివస్త్రను చేసి దాడి చేశారు. ఈ దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించారు. ఈ విషయం బయటకు చెబితే వీడియోను నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని ఆమెను బెదిరించారు. దాడి ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. ఆమె జీజీహెచ్‌లో చేరింది.
శ్రీహరి నుంచి ప్రాణ హాని ఉంది..
ఇంతలో విషయం తెలుసుకున్న ప్రత్యర్థి వర్గానికి చెందిన ఓ మహిళ ఆస్పత్రికి చేరుకుని ఆమెను బలవంతంగా ఆస్పత్రిలో నుంచి తీసుకెళ్లేందుకు యత్నించగా బాధితురాలు ప్రతిఘటించింది. నీపై సైతం కేసు పెడుతామని బెదిరించడంతో ఆమె అక్కడి నుంచి జారుకొంది. ఈ మేరకు బాధితురాలు జీజీహెచ్ ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేసిన శ్రీహరి, ప్రదీప్‌తోపాటు అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. శ్రీహరి నుంచి తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసు ఉన్నతాధికారులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment