బతుకు బుగ్గి | life burnt | Sakshi
Sakshi News home page

బతుకు బుగ్గి

Published Mon, Mar 5 2018 10:21 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

life burnt - Sakshi

ప్రమాద దృశ్యం

పెనుగంచిప్రోలు : వారంతా నిరుపేదలు...అమ్మ సన్నిధిలో జీవితాలు వెళ్లదీస్తున్నారు...తిరునాళ్ల సందర్భంగా చిరు వ్యాపారాలు చేసుకొని కుటుంబ పోషణకు సంపాదించుకుందామన్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రమాదవశాత్తూ ఆదివారం మధ్యాహ్నం చెలరేగిన మంటలు వారి జీవితాల్లో తీరని వేదనను మిగిల్చాయి. పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మవారి చిన్న తిరునాళ్ల సందర్భంగా మునేరులో పాకలు వేసుకొని పేదలు చిరు వ్యాపారాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మునేరు వెళ్లే దారిలో ఒక పక్క పాకలో పొంగళ్లు చేస్తుంటే ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు గాలి కూడా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి సుమారు 50 దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.

దీంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని దుకాణదారులతో పాటు, పాకల్లో ఉన్న భక్తులు పరుగులు తీశారు. పాకలు మొత్తం తాటాకు, పట్టాలతో కావడంతో ప్రమాద తీవ్రత బాగా ఉంది. తిరునాళ్లకు వ్యాపారులు ఒకొక్కరు రూ.5 నుంచి రూ.10లకు వడ్డీలకు తెచ్చి సరుకు పాకల్లో ఉంచారు. అది కాస్తా  బుగ్గి కావడంతో వ్యాపారులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.  ప్రమాదంలో కోళ్లు, కొబ్బరికాయలు, బొమ్మలు, కుండలు, గుడ్లతో పాటు రెండు రోజుల వ్యాపారంలో వచ్చిన డబ్బులు కూడా బూడిదయ్యాయి.

తిరునాళ్ల ఐదు రోజుల పాటు అయితే పసుపు–కుంకుమల రోజు మాత్రమే ఫైర్‌ ఇంజన్‌ కావాలని ఆలయ అధికారులు కోరడం, ఆదివారం ఉదయం ఫైర్‌ ఇంజన్‌ వెళ్లడం, మధ్యాహ్నం ప్రమాదం జరిగిందని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా మునేరులో పాకలకు విద్యుత్‌ సౌకర్యం, గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేయడం కూడా ప్రమాదానికి కారణంగా ఉంది. ఒక్క సిలిండర్‌కు 5 నుంచి 10 పొయ్యులు ఏర్పాటు చేస్తారు. దీంతో పైప్‌లు లీకై మంటలు వ్యాపించి ప్రమాదాలు జరుగుతున్నాయి. 

అధికారుల నిర్లక్ష్యమే కారణం

మునేరులో జరిగిన ప్రమాదానికి దేవస్థాన అధికారులతోపాటు ఇతర శాఖల అధికారుల నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్‌ ఇంజన్‌ ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రమాద స్థలిని పరి శీలించిన జాయింట్‌ కలెక్టర్‌–2 బాబూరావుకు కూడా బాధితులు, స్థానికులు ఇదే విషయాన్ని తెలియజేశారు. దీనిపై ఆయన వెంటనే సమన్వయ సమావేశం సందర్భంగా రాసి న మినిట్స్‌ తీసుకు రమ్మని ఆలయ అధికారులను ఆదేశించారు. దానిలో కేవలం రెండు రోజులు మాత్రమే ఫైర్‌ ఇంజన్‌ కావాలని రాసి ఉండటంతో జేసీ ఈవో ఎం రఘునాథ్, ఇతర అధికారులపై  ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమన్వయ సమావేశానికి ఆర్డీవోను ఎలా పిలవాలో తెలియదు, ఐదు రోజుల తిరునాళ్లకు ఒక్క రోజే ఫైర్‌ ఇంజన్‌  కావాలని ఎందుకు రాశారు అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని వైఎస్సార్‌సీపీ విజ యవాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, జగ్గయ్యపేట మున్సిపల్‌ చైర్మన్‌ ఇంటూరి చిన్నా, ఆలయ ఈవో రఘునా«థ్, చైర్మన్‌ కర్ల వెంకట నారాయణ, డీఈ రమ, వైఎస్సార్‌సీపీ పంచా యతీ విభాగపు జిల్లా అధ్యక్షుడు తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఇంజం కేశవరావు,  మండల కన్వీనర్లు కంచేటి రమేష్, చిలుకూరి శ్రీనివాసరావు,  కాకాని హరి, ముత్యాల చలం,  వేల్పుల రవికుమార్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఇంటూరి నాగేశ్వరరావు, సీపీఎం మండల కార్యదర్శి అరుణ్‌కుమార్‌ సందర్శించి బాధితులతో మాట్లాడారు. 

 బాధితులను ఆదుకుంటాం : కలెక్టర్‌

విజయవాడ: పెనుగంచిప్రోలులో లక్ష్మీతిరుపతమ్మ  ఆలయ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. లక్ష్మీతిరుపతమ్మ ఆలయంలో ఆదివా రం భక్తులు పొంగళ్ల తయారీ సమయంలో జరిగిన అగ్ని ప్రమా ద ఘటనలో తాత్కాలిక గుడారాలకు నిప్పంటుకుని దగ్ధం కావ డం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో నష్టపోయిన ఒక్కొక్కరికి రూ.7వేల చొప్పున 42 మందికి పరిహారం చెక్కులను తక్షణమే అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ –2 పి.బాబూ రావును ఆదేశించినట్లు కలెక్టర్‌ తెలిపారు. బాధితులకు భోజన సదుపాయాలు కల్పించాలని వా రికి అవసరమైన రుణాలు మంజూరు చేయాలని ఆదేశించానన్నారు. 

ప్రభుత్వ వైఫల్యం : ఉదయభాను
 
ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని వైఎస్సార్‌సీపీ విజయవాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు. ప్రమాదంలో చిరు వ్యాపారులు దారుణంగా నష్ట పోయారన్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు చేస్తున్నారని, వారికి ఇలా కావటంచాలా దురదృష్టకరమన్నారు. ఫైర్‌ ఇంజన్‌ కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండటం వల్ల ఈప్రమాదం జరిగిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. ప్రమాదంలో నష్టపోయిన వారికి ఒకొక్కరికి రూ.1 నుంచి రూ.1.50 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
 

సంఘటనాస్థలంలో వివరాలు అడిగి తెలుసుకుంటున్న వైఎస్సార్‌సీపీ నేత ఉదయ భాను

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement