
సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో బ్యాంకులను రూ.1,768 కోట్ల మేర మోసం చేసిన లియో మెరీడియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్ లిమిటెడ్ (ఎల్‌ఎమ్‌ఐపీహెచ్‌ఎల్) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. సంస్థ ప్రమోటర్ జీఎస్ చక్రవర్తి రాజు, అతని ప్రధాన అనుచరుడు ఏవీ ప్రసాద్‌లను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ (పీఎమ్‌ఎల్‌ఏ) చట్టం 2002 ప్రకారం అరెస్టు చేసినట్లు బుధవారం ఈడీ ప్రకటించింది. పీఎమ్‌ఎల్‌ఏ ప్రత్యేక జడ్జి వీరిద్దరికి ఏడు రోజుల కస్టడీ విధించారు. జీఎస్‌సీ రాజు, అతని బంధువులు, డైరెక్టర్లు, బినామీల పేర్ల మీద ఉన్న రూ.250.39 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బ్యాంకుల మోసంలో గతంలోనే బెంగళూరు సీబీఐ నమోదు చేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ప్రస్తుత పీఎంఎల్‌ఏ కేసులో ముందుకు సాగుతోంది.
కుట్ర జరిగిందిలా..!
ఈడీ అధికారుల వివరాల ప్రకారం.. మొత్తం కుట్రకు జీఎస్‌సీ రాజు సూత్రధారి. తొలుత ఒక అక్రమ లేఅవుట్‌ను క్రియేట్ చేసి దాన్ని ప్లాట్లుగా మార్చి 315 మందికి విక్రయించారు. రిసార్ట్ ప్రాజెక్టు కోసమని చెప్పి.. ఆ లేఅవుట్‌లో విక్రయించిన ప్లాట్లనే బ్యాంకుల్లో కుదవపెట్టాడు. ఈ జాబితాలో అప్రోచ్ రోడ్లు ఉండటం గమనార్హం. ఈ విషయం బ్యాంకు అధికారులు గుర్తించకుండా రెవెన్యూ రికార్డులు సైతం ట్యాంపర్ చేశాడు. ఈ విషయం ప్లాట్ల ఓనర్లకు కూడా తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అనంతరం 33 షెల్ కంపెనీలను సృష్టించాడు. వాటితో ఎల్‌ఎమ్‌ఐ పీహెచ్‌ఎల్‌లోకి రూ.372 కోట్లు నిధులు మళ్లించినట్లు చూపాడు. ఇందుకోసం కోల్‌కతాకు చెందిన ‘జమా ఖరచ్’అనే కంపెనీని వాడుకున్నాడు.
తమ కంపెనీ ద్వారా చేపడుతున్న ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చూపించి, వివిధ బ్యాంకుల వద్ద రూ.1,768 కోట్లు (ఇందులో బ్యాంకుల కన్సార్టియం వద్ద రూ.700 కోట్లు) రుణంగా పొందాడు. తర్వాత మరో 40 డొల్ల కంపెనీలను సృష్టించి బోగస్ బిల్లులు, ఇన్వాయిస్‌లతో భారీ నిధులను దారి మళ్లించాడు. ఇప్పటిదాకా దారి మళ్లించిన నిధుల్లో రూ.182 కోట్ల లావాదేవీల ఆధారాలను ఈడీ గుర్తించింది. మొత్తానికి ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా జీఎస్‌సీ రాజు అతని కుటుంబ సభ్యులు 95 శాతం వ్యాపారానికి యజమానులుగా మారారు.
అన్ని కోట్ల వ్యాపారానికి నో బ్యాలెన్స్ షీట్
ఈడీ అధికారుల బృందం దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. రూ.1,768 కోట్ల వ్యాపారానికి ఇంతవరకూ ఎలాంటి బ్యాలెన్స్ షీట్ కూడా నిర్వహించకపోవడం గమనార్హం. వారు ఏ ప్రాజెక్టు చేపట్టారు? ఎన్ని నిర్మాణాలు జరిపారు? అన్న విషయాలపై కనీసం ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. దీంతో జీఎస్‌ఆర్ రాజు బ్యాంకులకు తిరిగి చెల్లించే ఉద్దేశం లేకుండానే.. కేవలం ఎగవేతనే లక్ష్యంగా రుణాలు తీసుకున్నట్లు స్పష్టమైంది. వీరు కుదవపెట్టిన ఆస్తులు కూడా బోగస్ కావడంతో బ్యాంకు అధికారులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. స్థానికంగా వీరికి పలుకుబడి ఉండటంతో బినామీలపై ఆస్తులను సులువుగా సంపాదించగలిగారు.
దర్యాప్తులో 33 షెల్ కంపెనీలు, 44 షెల్ వెండర్ల గుట్టు వీడింది. 3,43,18,948 ప్రమోటర్ల షేర్లలో 76,62,434 షేర్లు బినామీల పేర్లపై ఉన్నాయని గుర్తించారు. జీఎస్‌సీ రాజు అతని కుటుంబ సభ్యుల పేరిట 11 స్థిరాస్తులు, అతని బినామీలపై మరో 38 స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. వీటి మొత్తం విలువ రూ.250.39 కోట్లుగా లెక్కగట్టారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ కేసులో మరిన్ని వాస్తవాలు తవ్వితీసే పనిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment