కింతాడ అంజిబాబు మృతదేహం మృతి చెందిన మాసా నవ్య
తూర్పుగోదావరి, ప్రత్తిపాడు: ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రేమికులు ఆత్మహత్య చేసుకుని, మృతి చెందారు. ఎవరూ లేని సమయంలో గదిలో దూలానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్ప డ్డారు. ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాద సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. లంపకలోవ గ్రామానికి చెందిన మాసా ఏసుబాబు, రాణి దంపతుల కుమార్తె నవ్య (17) గత ఏడాది పదో తరగతి పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు జీవనోపాధి కోసం దూర ప్రాంతంలో ఇటుకబట్టీలో పనిచేస్తున్నారు. నవ్య తన నాయనమ్మ మాసా ముసలమ్మతో కలిసి ఉంటోంది.
అదే గ్రామానికి చెందిన కింతాడ అంజిబాబు (21) పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అంజిబాబు, నవ్యలు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి అంజిబాబు తల్లిదండ్రులు రాంబాబు, నూకాలమ్మలు అంజిబాబు, నవ్యలకు వివాహం చేయాలని నవ్య తల్లిదండ్రులను కోరారు. కానీ బంధువుల అబ్బాయితో తమ కుమార్తెకు వివాహం చేస్తామంటూ ఏసుబాబు, రాణిలు తిరస్కరించారు. పెద్దలు తమ వివాహానికి అంగీకరించకపోవడంతో నవ్య ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ కలిసి ఈ అఘాయిత్యానికి పాలడ్డారు. మాసా ముసలమ్మ ఇంటికి వచ్చి తలుపు తీసి చూడగా నవ్య మృతదేహం కిందన, దూలానికి వేలాడుతూ అంజిబాబు ఉండడంతో కేకలు పెట్టింది. ఇరుగు పొరుగు ఇచ్చిన సమాచారంతో ప్రత్తిపాడు ఎస్సై ఎం అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని, విచారిస్తున్నారు.
రెండు కుటుంబాల్లో విషాదం
ప్రేమికుల ఆత్మహత్య రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇరుగు పొరుగుతో సఖ్యతతో ఉండే అంజిబాబు, నవ్యలు మృతి చెందడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. నవ్య నాయనమ్మ ముసలమ్మను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. పిల్లను చేతిలో పెట్టి బతుకు దెరువు కోసం దూరప్రాంతాని వెళ్లిన తన కొడుకు, కోడలికి ఏమి చెప్పాలంటూ బోరున విలపిస్తోంది. ఇక కింతాడ రాంబాబు, నూకాలమ్మ దంపతుల మూడో సంతానమైన అంజిబాబు ఎలక్ట్రికల్, పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు మృతిని వారు తట్టుకోలేకపోతున్నారు. సాయంత్రం వరకు కళ్లముందు ఉన్న కొడుకు విగతజీవుడుగా మారడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తాళి కట్టాకే ఆత్మహత్య ?
మాసా నవ్య మెడలో పసుపుతాడు ఉండడంతో ఆత్మహత్యకు ముందే ఆ గదిలో వివాహం చేసుకున్నారా? అనే అనుమానం కలుగుతోంది. వారిద్దరి వివాహానికి నవ్య తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని స్థానికులు అనుకుంటున్నారు. ప్రేమ పెళ్లి చేసుకోగలిగామనే సంతృప్తితోనే ఆఖరి క్షణంలో వివాహం చేసుకుని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఆత్మహత్యల వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుందన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment