ప్రతి నెలా రూ.1100 తీసుకుంటున్నట్లు నిర్వాహకులు రాసిన ఇచ్చిన కార్డు
అక్రమ సంపాదనకు కొందరు పక్కా స్కెచ్ వేశారు.. బహుమతుల పేరిట అమాయకులను మోసం చేసే ‘స్కీం’కు తెర లేపారు.. అందమైన బ్రోచర్లు ముద్రించి బుట్టలో దింపుతున్నారు. కొద్ది మొత్తం కడితే చాలు, పెద్ద బహుమతులు సొంతం చేసుకోవచ్చని వందలాది మందికి ఆశ చూపి, మాయలో పడేస్తున్నారు. ఇలా నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసి, ఒకరిద్దరికి బహుమతులు కట్టబెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మిగతా వారికి ఏదో నామమాత్రపు వస్తువు అంటగట్టి, పెద్ద మొత్తంలో వెనుకేసుకుంటున్నారు. ప్రజలను ముంచే ఈ ‘స్కీం’ల దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, బహిరంగంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని నియంత్రించాల్సిన పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఎంటర్‌ప్రైజెస్‌ల పేరిట అక్రమ స్కీంలు జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి.. ప్రజలను నిండా ముంచే ఇలాంటి ‘పథకాలు’ విచ్చలవిడిగా నడుస్తున్నాయి. స్కీంలు, లక్కీ డ్రా పేరుతో ప్రజల డబ్బును కొందరు అక్రమంగా వెనుకేసుకుంటున్నారు. ‘‘నెలకు కేవలం రూ.1,100 చొప్పున పది నెలలు చెల్లించండి.. కారు గెలుచుకోండి.. ఒక్క కారే కాదు, రూ.80 వేల విలువ చేసే బైక్, బంగారం, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మిషన్, ఫ్రిజ్ వంటి గృహోపకరణాలను కూడా పొందవచ్చు..’’ అంటూ బురిడీ కొట్టిస్తున్నారు.
అందమైన బ్రోచర్లను ముద్రించి బుట్టలో వేసుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని నందిపేట్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్, వర్నిల కేంద్రంగా ఇలాంటి దందాలు నడుస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో కూడా ఈ అక్రమ స్కీంలు గుట్టుగా నడుస్తున్నట్లు సమాచారం. పేద, మధ్య తరగతి ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని రూ.కోట్లలో టర్నోవర్ నిర్వహిస్తున్నారు. పరిసర గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుని వందలాది మందిని సభ్యులుగా చేర్చుకుంటున్నారు.
రూ.కోట్లల్లో దందా..
స్కీంలు, లక్కీ డ్రాల పేరుతో ప్రతి నెలా రూ.కోట్లల్లో దందా కొనసాగుతోంది. ఒక్కో స్కీంలో సుమారు 500 నుంచి వెయ్యి మందిని చేర్చుకుంటున్నారు. పది నెలలు, 15 నెలలు, 20 నెలలు, 25 నెలలు.. ఇలా వివిధ కాల పరిమితితో స్కీంలు నడుపుతున్నారు. ఈ స్కీంలలో సభ్యులుగా చేరిన వారు ప్రతి నెల రూ.వెయ్యి నుంచి రూ.నాలుగు వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రూ.వెయ్యి చొప్పున వెయ్యి మంది సభ్యులు కలిగిన స్కీంలో ప్రతి నెలా రూ.10 లక్షలు పోగేస్తున్నారు. స్కీం కాల పరిమితి పది నెలల్లో రూ.కోటి వరకు టర్నోవర్ చేస్తున్నారు. ఇలా ఒక్క స్కీంలోనే రూ.కోటి టర్నోవర్ జరుగుతోందంటే.. అన్ని స్కీంలలో కలిసి ఏ స్థాయిలో అక్రమ దందా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
భారీ బహుమతులను ఆశ చూపి..
వందల సంఖ్యలో సభ్యులను చేర్చుకుంటున్న స్కీం నిర్వాహకులు.. లక్కీ డ్రా నిర్వహించి ఒకరిద్దరికి కారు, బైక్‌లు అందజేస్తున్నారు. మిగిలిన వారికి చిన్న చిన్న గృహోపకరణాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. స్కీంలో చేరిన ప్రతి సభ్యుడికి బహుమతి వస్తుందని ఆశ చూపి, కన్సోలేషన్ బహుమతుల పేరుతో నామమాత్రపు విలువ కలిగిన బహుమతులను అంటగడుతున్నారు. ఇలా సభ్యుల వద్ద వసూలు చేసిన మొత్తంలో కనీసం సగం విలువ చేసే బహుమతులను కూడా ఇవ్వడం లేదు. అదృష్టం ఉంటే కారు, బైక్, గృహోపకరణాలు గెలుచుకోవచ్చనే ఆశతో అమాయక ప్రజలు ఈ స్కీంల్లో చేరుతున్నారు. వీరి ఆశను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రూ.లక్షలు దండుకుంటున్నారు.
గతంలో కేసులు నమోదు..
నిబంధనల ప్రకారం ఇలాంటి స్కీంలు నిర్వహించడానికి అనుమతులు లేవు. ఇలాంటి స్కీంల పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతున్న వారిపై నిఘా ఉంచి సుమోటోగా కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ తమకు ఫిర్యాదులు అందలేదంటూ సంబంధిత పోలీసులు దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ఇలాగే స్కీంల పేరుతో అక్రమ దందా కొనసాగించిన వారిపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అలాగే, మోర్తాడ్, కమ్మర్‌పల్లి ఠాణాల పరిధిలోనూ గతంలో కొందరు స్కీం నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇలాంటి స్కీం నిర్వాహకుల వైపు చూడడమే మానేశారు.
స్కీంలు చట్ట విరుద్ధం..
స్కీంలు, లక్కీ డ్రాలు నిర్వహించడం చట్ట విరుద్ధం. ఇలాంటివి నడుస్తున్నట్లు మా దృష్టిలో లేదు. స్కీముల పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – మంత్రి సుదర్శన్, ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment