సాక్షి, హైదరాబాద్: ‘నేను బ్రాహ్మణుడిని.. నా తండ్రి వైజాగ్‌లోని ఓ దేవాలయంలో పూజారిగా పనిచేసేవారు. ఆ సమయంలో నేను బ్రాహ్మణులపై రాసిన పాట తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని బ్రాహ్మణసమాజం నన్ను వెలివేసింది. అప్పటి నుంచి మానసిక క్షోభకు గురయ్యాను. వ్యవస్థపై కక్ష పెంచుకున్నాను. అందుకే ఆలయాలను లక్ష్యంగా చేసుకొని పూజారుల బ్యాగులు, సెల్‌ఫోన్లను చోరీ చేయడమే కాకుండా 2013లో కాకినాడలోని బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శఠగోపాన్ని ఎత్తుకెళ్లా. నాలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. కసితోనే ఇలా చేస్తున్నాను’ అని ఆలయాల్లో పూజారుల బ్యాగులు, సెల్‌ఫోన్లు, శఠగోపాలు తస్కరిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు చిక్కిన ప్రముఖ సినీ గేయరచయిత తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్ పేర్కొన్నారు.
చోరీ కేసులో అరెస్టైన కులశేఖర్‌ను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. విశాఖపట్నం జిల్లా, సింహాచలం బృందావన్‌కాలనీకి చెందిన కులశేఖర్ నగరంలోని మోతీనగర్‌లో అద్దెకుంటున్నాడు. ఒకవైపు బ్రాహ్మణ సమాజం వెలివేయగా మరో వైపు కట్టుకున్న భార్య కూడా అతడిని వదిలేసి పిల్లలతో సహా వెళ్లిపోయింది. దీంతో తాను పిచ్చివాడినయ్యానని చెప్పుకొచ్చాడు. తరచూ పోలీసులకు చిక్కుతున్నా తన ప్రవర్తనలో మార్పు రాకపోగా అది మరింత పెరుగుతున్నట్లు తెలిపాడు.
ప్రముఖ సినీ గేయ రచయితగా గుర్తింపు పొందిన కులశేఖర్ వంద సినిమాలకు పాటలు రాశాడు. అందులో 50 శాతం సూపర్ హిట్ కావడం విశేషం. రాజమండ్రి జైలులో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించినా అతని వైఖరిలో మార్పు రాలేదు. 2008 నుంచి మెదడుకు సంబంధించిన వ్యాధి కారణంగా జ్ఞాపకశక్తిని కోల్పోవడమే కాకుండా తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment