పట్నా : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో తోటివారికి అండగా నిలవాల్సిందిపోయి కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కరోనా అనుమానితులుగా భావిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర నుంచి బిహార్ చేరుకున్న ఓ కార్మికుడిని స్థానికులు దారుణంగా కొట్టి హతమార్చారు. ఘటన బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌కు చెందిన ఓ కార్మికుడు ఉపాధి కోసం మహారాష్ట్ర వలస వెళ్లాడు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అక్కడే చిక్కుకుపోయాడు. (కరోనా వైరస్: వారిపైనే ఫోకస్)
మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అతను కుటుంబంతో సహా.. స్వస్థలం బిహార్‌కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు స్థానికులు ఆ కార్మికుడిని స్వగ్రామంలోకి అనుమతించేందుకు నిరాకరించారు. ఈ క్రమంలోనే వారిద్దరు అతనిపై దాడి చేసి హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment