
గౌతమ్, గౌతమ్‌తో బాధిత యువతి
ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఆమెను గర్భవతిని చేసి పెళ్లి మాటెత్తేసరికి ముఖం చాటేశాడు. కొన్ని గంటల్లో మరో అమ్మాయికి తాళి కట్టడానికి సిద్ధమైన ఆ వంచకుడు బాధితురాలి ఫిర్యాదుతో కటకటాల పాలయ్యాడు.
దొడ్డబళ్లాపురం: భర్తకు దూరంగా ఉంటున్న యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారం చేసి, తీరా ఆమె గర్భవతి అయ్యాక మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డ మోసగాడిని, అతడి తండ్రిని దొడ్డ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పరిధిలోని కరేనహళ్లి నివాసులయిన రాజన్న(45)ఇతడి కుమారుడు బుల్లెట్ గౌతమ్(22)అరెస్టయిన నిందితులు.
జిమ్‌కు వెళ్తుండగా వల
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు... పట్టణ శివారులోని జాలప్ప కళాశాల క్వార్టర్స్ వద్ద నివసిస్తున్న వివాహిత యువతి (24) భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె పట్టణంలోని కోర్టు రోడ్డులో ఉన్న బుల్లెట్ జిమ్‌కు సంవత్సరం నుండి ఫిట్‌నెస్ కోసం నిత్యం వచ్చేది. ఈ క్రమంలో జిమ్ ఓనర్ గౌతమ్ మాటలు కలిపి పరిచయం పెంచుకుని కొద్ది రోజులకు ప్రేమిస్తున్నానని చెప్పాడు.పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మబలికాడు. భర్తకు విడాకులు ఇచ్చి వస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. జిమ్‌లో, బెంగళూరు రోడ్డులోని ఒక అపార్ట్‌మెంటు గదిలో, హోటల్ రూంలలో అనేకసార్లు వద్దన్నా తనపై అత్యాచారం చేసాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.
పెళ్లికి ససేమిరా
ఆమె గత నెల గర్భందాల్చింది. విషయం గౌతమ్‌కు చెప్పడంతో పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయం గౌతమ్ తండ్రికి చెప్పినా ఆయన పట్టించుకోలేదు. చాలదన్నట్టు గుట్టుగా ఘాటిక్షేత్రంలో తన కొడుక్కి మరో యువతితో బుధవారంనాడు వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. దీంతో యువతి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు తండ్రీ, కొడుకును అరెస్టు చేశారు.
జిమ్ పెట్టింది అందుకేనా?
గౌతమ్ అమ్మాయిలను వలలో వేసుకోవడానికే వ్యాయామశాలను ప్రారంభించాడని, జిమ్‌లో వ్యాయామం చేయిస్తూ అమ్మాయిలను ఆకర్షిస్తాడని, ఇప్పటికే గౌతమ్ చేతిలో అనేకమంది అమ్మాయిలు మోసపోయారని సమాచారం. ఇక గౌతమ్ తండ్రి కరేనహళ్లిలో నేత కార్మికులకు రుణాలు ఇస్తూ మీటర్ వడ్డీలు వసూలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment