
సాక్షి, ఒంగోలు, రాజమండ్రి : ఏటీఎం సెంటర్ల వద్ద అమాయకులను నమ్మించి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఇంకొల్లు సీఐ రాంబాబు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. మండలంలోని బొబ్బేపల్లికి చెందిన రైతు దండా రామాంజనేయులు గత నెల 8వ తేదీన మార్టూరు స్టేట్ బ్యాంకు పక్కన ఏటీఎం సెంటర్‌కు నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు.
అప్పటికే అక్కడ ఉన్న ఓ యువకుడికి ఏటీఎం కార్డు ఇచ్చి పిన్ నంబర్ సైతం చెప్పాడు. అనంతరం తన బ్యాంకు ఖాతాలో ఎంత నగదు ఉందో చూసి చెప్పమని కోరాడు. ఆ అపరిచితుడు ఏటీఎం కార్డు ద్వారా ఆయన ఖాతాలో లక్షా యాభై వేల రూపాయలు ఉన్నట్లు చెబుతూ కార్డు తిరిగి ఇచ్చే క్రమంలో మరొక ఏటీఎం కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆ యువకుడు మొత్తం లక్షా నలభై వేల రూపాయలను రైతు ఖాతా నుంచి తనకు పరిచయమున్న మరొకరి ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న రైతు రామాంజనేయులు పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశాడు.
కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు రాజమండ్రికి చెందిన కొమ్మరాజు వీరసాయి కిరణ్‌గా గుర్తించారు. ఇతడు టంగుటూరులోనూ ఇదే తరహా దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి 95 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని అద్దంకి కోర్టులో హాజరు పరిచారు. విలేకరుల సమావేశంలో సీఐతో పాటు ఎస్సై మల్లికార్జునరావు, ఏఎస్సై బాలకృష్ణ, కానిస్టేబుల్ నాగూరు పాల్గొన్నారు. చదవండి : రోగిగా వచ్చి వైద్యుడికి మస్కా
Comments
Please login to add a commentAdd a comment