భార్య శవాన్ని తోపుడు బండిలో తీసుకెళ్తున్న కన్హయ్య
లక్నో: మానవత్వం మసకబారుతోంది. డబ్బుకు ఉన్న పాటి విలువ మనిషి ప్రాణానికి లేకుండా పోయింది. ఒడిస్సాలో కొన్ని నెలల కిందట అంబులెన్స్‌కు డబ్బు చెల్లించే స్తోమత లేక ఓ వ్యక్తి తన భార్య శవాన్ని తన భుజంపై మోసుకుని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లటం అప్పట్లో అందరి మనసులను కదిలించింది. ఆ ఘటన మరవక ముందే అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషాదంలో ఒకవైపు అంబులెన్స్ సిబ్బంది చేసిన ఆలస్యం నిండు ప్రాణాలు తీస్తే.. మరోవైపు వైద్యుల కర్కశత్వం కట్టుకున్న భార్య శవాన్ని కిలోమీటర్ల దూరానికి తోపుడు బండిలో తోసుకుంటూ తీసుకెళ్లేలా చేసింది.
మంగళవారం నాడు మెయిన్‌పురి జిల్లాకు చెందిన 36 ఏళ్ల కన్హయ్యలాల్ తన భార్య సోనీ అస్వస్థతకు లోనవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. గంటలు గడిచిన అంబులెన్స్ రాకపోవడంతో భార్యను తోపుడు బండిపై తోసుకుంటూ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మెయిన్‌పురి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే చనిపోయిందని చెప్పడంతో ఒక్క సారిగా కప్పకూలాడు కన్హయ్య. గుండె దిటవు చేసుకొని భార్య శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని కోరినప్పటికి ఆస్పత్రి వర్గాలు అందుకు ఒప్పుకోలేదు.
దినసరి కూలీగా పనిచేస్తున్న అతను చేసేదేమీ లేక భార్య శవాన్ని గుడ్డలతో చుట్టి తోపుడు బండిపై తోసుకుంటూ వెళ్లాడు. ఈ దృశాన్ని చూసిన అక్కడి ప్రజల కళ్లు చెమ్మగిల్లాయి వారు ఆస్పత్రి వర్గాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై యూపీ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ త్రివేది స్పందిస్తూ.. 108 అంబులెన్స్ నెంబర్‌కు ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. కన్హయ్య చాలా పేదవాడు అతని దగ్గర ఫోన్ చేసేందుకు మొబైల్ కూడా లేదన్నారు. ఒకవేళ ఫోన్ చేసినా ఆస్పత్రికో లేదా వేరొక నెంబర్‌కో ఫోన్ చేసి ఉంటారని తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment