సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : కుమార్తెను చూసేందుకు వెళ్లిన ఓ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. పట్టణంలో ఆదివారం చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నందవరం మండలం టి.సోమలగూడూరు గ్రామానికి చెందిన హరిజన కర్రెప్ప(45)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. పెద్ద కుమార్తె గౌతమి గోనెగండ్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. ఆదివారం పాఠశాలకు సెలవు కావటంతో కుమార్తెను చూడటానికి ఇంటి నుంచి క్యారియర్ తీసుకొని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి శ్యాంసన్‌తో పాటు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.
మధ్యలో కలుగొట్ల గ్రామంలోని సోదరి దానమ్మను పలకరించి, కూతురి వద్దకు బయలుదేరాడు. పట్టణంలోని ఎద్దుల మార్కెట్ వద్దనున్న రోడ్డు మలుపు దాటుతుండగా కర్నూల్ వైపు నుంచి సిమెంట్ లోడ్ లారీ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. లారీ కర్రెప్ప తలపై ఎక్కడంతో నుజ్జనుజ్జయింది. వెనుక కూర్చున్న శ్యాంసన్ కాలికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని, పోస్ట్‌మార్టంకోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని బోరున విలపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment