ఉపాధికోసం వచ్చి ఊపిరొదిలాడు | Man Dies After Swimming Pool Mishap In Adilabad District | Sakshi
Sakshi News home page

ఉపాధికోసం వచ్చి ఊపిరొదిలాడు

Published Tue, May 28 2019 11:04 AM | Last Updated on Tue, May 28 2019 11:04 AM

Man Dies After Swimming Pool Mishap In Adilabad District - Sakshi

గుడిహత్నూర్‌(బోథ్‌): మండలంలోని సూర్యగూడ పంచాయతీ పరిధిలోని క్వారీ నీటిగుంతలో గల్లంతై గింజల దుర్గాప్రసాద్‌ (21) అనే యువకుడు మృతి చెందాడు. తోటి స్నేహితులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలోని పిఠాపురానికి చెందిన దుర్గాప్రసాద్‌ స్థానిక సీ5 కంపనీలో అద్దెకు నడుస్తున్న తారురోడ్డు వేసే యంత్రాన్ని ఆపరేట్‌ చేస్తూ క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం క్యాంపులోని మరో ముగ్గురితో పాటు క్యాంపు సమీపంలో ఉన్న క్వారీలో స్నానం చేయడానికి వెళ్లారు. ఎవరికి వారు స్నానం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

బండమీద స్నానం చేస్తున్న దుర్గాప్రసాద్‌ కాలుజారి నీటిలో మునిగిపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో క్యాంపులో ఉన్న వారికి సమాచారం అందించారు. దీంతో క్యాంపు అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే చీకటి పడడంతో సహాయక చర్యలు తీసుకోలేక పోయారు. సోమవారం ఉదయం కుంటాల జలపాతానికి చెందిన గజ ఈతగాళ్లను రప్పించి మృత దేహాన్ని వెలికి తీయించారు. 

నష్టపరిహారం చెల్లించాలి 
ఉపాధి కోసం ఆంధ్ర నుంచి వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గాప్రసాద్‌ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని స్థానిక సూర్యగూడ, ఉమ్రి (బి) ఆదివాసీలు, బంధువులు సీ5 కంపనీ యాజమాన్యంతో పాటు తాను ఆపరేట్‌ చేసే యంత్రం యజమానిని రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గంట సేపు సంప్రదింపులు జరిగిన అనంతరం సీ5 కంపనీ రూ.4 లక్షలు, యంత్రం యజమాని రూ.2 లక్షలు అందిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాముగౌడ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement