దాడిలో గాయపడిన కొండయ్య
నెల్లూరు ,అనుమసముద్రంపేట: మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. పొలం యజమానిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ఏఎస్‌పేట మండలంలోని గుడిపాడు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆవులమంద కొండయ్య తన పొలం దున్నేందుకు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి దేవరాల పెంచలయ్య ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకెళ్లాడు. ఆ ట్రాక్టర్‌కు డ్రైవర్‌గా అదే గ్రామానికి చెందిన కుండా జంగంరెడ్డిని ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం జంగంరెడ్డి ఫూటుగా మద్యం సేవించి ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ పొలం పక్క ఉన్న గట్లను చెదర గొట్టేస్తున్నాడు.
దీనిని వారించిన పొలం యజమాని కొండయ్య ‘నువ్వు మద్యం మత్తులో ఉన్నావు.. పొలం రేపు దున్నాలని’ కోరాడు. అయితే జంగంరెడ్డి ససేమిరా అంటూ అడ్డు వస్తే నిన్ను తొక్కిస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను దున్నేప్పుడే మీరు భూమి దున్నించుకోవాలంటూ ట్రాక్టర్‌ను యజమానికి పైకి తీసుకెళ్లాడు. పొలంలోనే ట్రాక్టర్‌తో తరముతూ వాహనంతో ఢీకొట్టి కాళ్లపై ఎక్కించేశాడు. దీంతో కొండయ్య తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న సమీపంలోని రైతులు వెంటనే వచ్చి కొండయ్యను ఆత్మకూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఏఎస్‌పేట ఎస్సై సెలవులో ఉండటంతో సమాచారమందుకున్న ఆత్మకూరు సీఐ అల్తాఫ్ హుస్సేన్, ఎస్సై నరేష్‌లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment