సాక్షి, హైదరాబాద్ : షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిపై అత్యాచారం, హత్య ఘటనను మరువక ముందే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. నిజాంపేటలో ఓ అపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై జయచంద్ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో బాధితురాలు ఉండగా, ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి తన సోదరితో కలిసి నిజాంపేటలో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటుంది. వారికి 20 రోజుల క్రితం మాట్రిమోని ద్వారా జయచంద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వారం రోజుల క్రితం సుజనాఫోరమ్ మాల్ వద్ద బాధితురాలి సోదరితో భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా పెళ్లి ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యులతో మాట్లాడాలని బాధితురాలి సోదరి చెప్పారు. ఈ పరిచయాన్ని అవకాశంగా తీసుకున్న జయచంద్.. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి వద్దకు వచ్చి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం గదిలో ఉన్న నగలతో పరారయ్యాడు. సాయంత్రం బాధితురాలు సోదరి ఇంటికి రాగా.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment