సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో గంజాయి కేసులు...గంజాయి వినియోగించే వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ వ్యసనం యువత బంగారు భవిష్యత్‌ను ఛిద్రం చేస్తోంది. మాదకద్రవ్యాల వాడకం, విక్రయం కేసుల్లో్ల యువతే అత్యధికంగా ఉంటున్న తీరు సర్వత్రా కలవరపరుస్తోంది. గతేడాదిగా మహానగరం పరిధిలో గంజాయి విక్రయం, సరఫరాకు సంబంధించి ఆబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు జరిపిన తనిఖీల్లో 300 కేజీలకు పైగా గంజాయి దొరకడం గమనార్హం. ఈ ఉదంతాలకు సంబంధించి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు సుమారు 200 కేసులు నమోదుచేశారు. ఆయా సంఘటనల్లో 412 మందిని అరెస్టు చేశారు. వీరిలో 20–30 మధ్య వయస్కులు సుమారు 200కు పైమాటేనని ఆబ్కారీశాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. నగరంలోని పలు వృత్తివిద్యా కళాశాలలు, హాస్టళ్లలో అలవాటయ్యే గంజాయి వారి ప్రాణాలకు చేటుతెస్తుందని వైద్యులు స్పష్టంచేస్తున్నారు.
సరదా అలవాటు ముంచేస్తోంది...
నగరంలో ఉన్నత చదువులు, వృత్తివిద్యాకోర్సులు, ఉద్యోగాలు చేస్తున్న రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన యువతీయువకులతోపాటు, పొరుగురాష్ట్రాలకు చెందినవారు, విదేశీయులు తొలుత సిగరెట్.. ఆతరవాత స్నేహితుల ప్రోద్భలంతో కొన్నిసార్లు గంజాయిని సరదాగా అలవాటు చేసుకుంటున్నారు. ఇదే వారి భవిష్యత్‌ను నాశనం చేస్తోంది. తొలుత పదిగ్రాముల గంజాయిని రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు కొనుగోలుచేస్తున్నారు. ఇక అది దొరకడం కష్టతరం అయినపుడు తామే సరఫరాదారుల అవతారమెత్తి డ్రగ్స్‌మాఫియా చేతిలో సమిధలుగా మారుతున్నారు.
అటవీప్రాంతాల నుంచి నగరానికి పది కేజీల గంజాయిని తరలిస్తే రూ.పదివేల వరకు గిట్టుబాటవుతుండడంతో జల్సాలకు అలవాటుపడిన యువత ఈ సరఫరాలో కీలక సూత్రధారులుగా మారుతున్నారు. తమ వ్యక్తిగత బైక్‌లు, కార్లు, రైళ్లు బస్సుల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని రవాణా చేస్తున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసుల తనిఖీలు జరిపిన ప్రతీసారీ ఇలాంటి వారే పట్టుబడుతున్నారు. అంతకుముందు నేరచరిత్ర లేని యువత సైతం ఈ దాడుల్లో దొరుకుతున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు చెబుతున్నారు. తొలిసారి పట్టుబడినపుడు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్నామని..తిరిగి అదేపనిగా ఇదే దందాలో కొనసాగుతున్నవారిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదుచేస్తున్నట్లు తెలిపారు. అయితే డ్రగ్స్‌మాఫియా వెనక ఉన్న బడాఅక్రమార్కులు చిక్కడంలేదని పోలీసులు వాపోతున్నారు. గంజాయి సరఫరా కేసుల్లో పట్టుబడిన యువత కూడా బడా అక్రమార్కుల పేర్లు, ఆచూకీ తెలపడం లేదని చెబుతున్నారు.
ఏటేటా పెరుగుతోన్న కేసులు..
గంజాయి అమ్మకం, సరఫరాకు సంబంధించి నగరంలో ఏటేటా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో 2017లో కేవలం 63 కేసులు నమోదుకాగా...2018లో ఏకంగా 200 కేసులు నమోదవడం గమనార్హం. కళాశాలలు, వర్సిటీ క్యాంపస్‌లు, హాస్టళ్లపై సరైన నిఘా లేకపోవడంతో విద్యార్థులు గంజాయి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇక విద్యార్థుల ప్రవర్తన, వ్యవహార శైలిపై ఇటు కళాశాలల అధ్యాపకులు, వసతిగృహాల నిర్వాహకులతోపాటు తల్లిదండ్రులు సైతం నిఘా పెట్టాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఆదిలోనే ఈ వ్యసనానికి అడ్డుకట్ట వేయాలన్నారు.
తస్మాత్ జాగ్రత్త...
గంజాయిలో ప్రమాదకరమైన ’టెట్రహైడ్రోకెన్నాబినాల్’ అనే రసాయణం ఉంటుంది. ఇది మొదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉన్నది లేన్నట్లు..లేనిది ఉ న్నట్లు భ్రమలు కల్పిస్తుంది. మానసిక ఆందోళనతో పాటు తీవ్రమైన ఉద్రేకతను రేకెత్తిస్తుంది. సరదాగా మొదలైన ఈ అలవాటు క్రమంగా బలహీనతకు గురి చేస్తుంది. ప్రస్తుతం నగరంలో 14 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు ఎక్కువగా ఈ గంజాయికి అలవాటు పడుతున్నారు. తొలుత సిగరెట్‌కు అలవాటు పడి, ఆ తర్వాత గంజాయి వాడుతున్నారు. చికాకు, కోపం, టెన్షనం, భయం, ఒంటరితనానికి అలవాటు పడటం వంటి లక్షణాలు కన్పిస్తాయి. జ్ఞాపకశక్తి తగ్గి, చదువులో వెనుకబడిపోతారు. తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల భారినపడే అవకాశం ఉంది. విచక్షణను కోల్పొయి దొంగతనాలు, దోపిడీలకే కాదు చివరకు హత్యలకు వెనుకాడరు. హోమియోపతి డి అడిక్షన్‌లో మంచి మందులు ఉన్నాయి. మూడు నుంచి ఆరు మాసాల కోర్సు వాడాల్సి ఉంటుంది. గంజాయి నుంచి విముక్తి పొందాలని భావించే వారు...మరిన్ని వివరాల కోసం 9885536313 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చు. – డాక్టర్ వై.జయరామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment