గంజాయి మత్తు వదిలేనా.. | Drugs Awareness in Hyderabad | Sakshi
Sakshi News home page

గంజాయి మత్తు వదిలేనా..

Published Mon, Jul 1 2019 10:35 AM | Last Updated on Fri, Jul 5 2019 8:12 AM

Drugs Awareness in Hyderabad - Sakshi

డ్రగ్స్‌ నియంత్రణపై ప్రచారం చేస్తున్న అధికారులు

సాక్షి సిటీబ్యూరో: దేశానికి రేపటి భవిష్యత్తును నిర్దేశించే యువత గంజాయి మత్తులో చిత్తవుతోంది. గంజాయి, డ్రగ్స్‌ మత్తులో ఉన్నప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటంతో  పాటు విచక్షణ కోల్పోయి ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. నగరంలో గంజాయి అమ్మకాలు, రవాణాకు ధూల్‌పేట్‌ కేంద్రంగా మారింది. ఆయా ప్రాంతాల్లో పలువురు స్మగ్లర్లు యథేచ్ఛగా ఈ దందా నిర్వహిస్తున్నారు. తక్కువ ధరలో సులువుగా గంజాయి లభిస్తుండటంతో యువత అధిక శాతం మంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్‌ అండ్‌ ప్రోహిబిషన్‌ శాఖ అధికారులు నిఘా తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా గంజాయి స్మగ్లర్లను గుర్తించి కేసులు పెట్టి జైలుకు పంపారు. అంతేగాక కొనుగోలు చేసేందుకు వస్తున్న యువకులను కూడా అదుపులోకి తీసుకుని వారిలో మొదటి సారి పట్టుబడినవారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపుతున్నారు. రెండో సారి పట్టుబడితే సెక్షన్‌ 27,28 నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రాఫిక్‌ సబ్‌స్టాన్‌సెస్‌ యాక్ట్‌ 1985 కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. దీంతో పరిస్థితుల్లో కొంత మేర మార్పు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

గంజాయి అడ్డాలపై నజర్‌....
ధూల్‌పేటలో గంజాయి విక్రయ కేంద్రాలు, అనుమానిత  వ్యక్తులపైన ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే గంజాయి అమ్మడం, రవాణా చేస్తున్న వారిని పట్టుకుని పలువురిపై కేసులు నమోదు చేయగా, మరికొందరిని జైలుకు పంపారు. అయినా అక్రమ సంపాదనకు అలవాటు పడిన వీరు యువలను లక్ష్యంగా చేసుకుని ఈ దందాను నడుపుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో ప్రతి రోజు 30 నుంచి 40 మంది గంజాయి కొనుగోలు చేస్తు లేదా సేవిస్తూ పట్టుబడుతున్నట్లు సమాచారం.

5 వేల మందికి కౌన్సెలింగ్‌...
గడిచిన 16 నెలల్లో 5 వేల మంది ఎక్సైజ్‌ అండ్‌ ప్రోహిబిషన్‌ అధికారులకు పట్టుబడ్డారు. వారిలో 85 శాతం మంది 16 నుంచి 25 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. 25 నుంచి 40 ఏళ్ల లోపు వారు కేవలం 15 శాతం లోపు ఉంటున్నట్లు అధి కారుల గణాంకాలు పేర్కొంటున్నాయి. వీరిలో నూ ఎక్కువ శాతం మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఇలా పట్టుబడిన వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తు న్నారు. రెండవ సారి పట్టుబడితే కేసులు నమోదు చేయడంతో పాటు జైలుకు పంపిస్తున్నారు. ఇలా వరుసగా పలుమార్లు పట్టుబడిన 30 మందిపైన కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు.

ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అవగాహన...
ఎక్కువ శాతం మంది యువతకు కళాశాలల్లో పరిచయం అయ్యే స్నేహితుల ద్వారానే ఒకరి నుంచి మరొరు గంజాయికి అలవాటు పడుతున్నట్లు సమాచారం. వాట్సాప్, సెల్‌ఫోన్‌ ద్వారా  గంజాయి విక్రేతలను సంప్రదించి కొనుగోలు కోసం ధూల్‌పేటకు వస్తూ ఎక్సైజ్‌   అధికారులకు చిక్కుతున్నారు. ఒక్క సారి పట్టుబడిన వారి నుంచి ఆధార్‌ కార్డు , సెల్‌ఫోన్‌ నెంబర్‌ను తీసుకున్న అధికారులు వారి ఫోన్లకు ‘గంజాయి సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదని, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచిస్తూనే ధూల్‌పేటకు గంజాయి కొనుగోలు కోసం రావద్దని ఇక్కడ నిత్యం నిఘా పెంచామని, పట్టుబడితే చట్ట ప్రకారం కేసులు  ఎదుర్కోవాల్సి వస్తుందని’ మేసేజ్‌లు పెడుతున్నారు. దీంతోపలువురు గంజాయి కొనుగోలు కోసం రావడం మానుకున్నారని ఎక్సైజ్‌ అధికారులు పేర్కొంటున్నారు. 

ఓ కంట కనిపెట్టాలి
తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉన్నా పిల్లలపై దృష్టి సారించాలి. పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు అనుమానం వస్తే వెంటనే వారిని కౌన్సిలింగ్, రిహాబిలిటేషన్‌ సెంటర్లకు తీసుకెళ్లాలి. కళాశాలల్లోనూ యాంటీ డ్రగ్స్‌ క్యాంపెయిన్‌లను నిర్వహించాలి. అధ్యాపకులు విద్యార్థుల ప్రవర్తనను గమనించి వారిలో మార్పు కోసం కృషి చేయాలి.–నవీన్‌ నాయక్,  ధూల్‌పేట ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఎస్‌హెచ్‌ఓ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement