రాజధానిలో.. డ్రగ్‌ కల్చర్‌! | Drug Culture Rises in Hyderabad | Sakshi
Sakshi News home page

రాజధానిలో.. డ్రగ్‌ కల్చర్‌!

Published Thu, Jun 27 2019 10:20 AM | Last Updated on Thu, Jun 27 2019 10:20 AM

Drug Culture Rises in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగరం డ్రగ్‌కల్చర్‌ విషయంలో ఇతర మెట్రోపాలిటన్‌ సిటీల సరసన చేరుతోందా..? ఔననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓపక్క పోలీసులు వీటికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నా... ఈ దందా మాత్రం ఆగడం లేదు. ఎక్సైజ్‌ అధికారులు సోమవారం ఏకంగా 254 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. నగరంలో  డిమాండ్‌ నేపథ్యంలో డ్రగ్‌ మాఫియా వ్యవస్థీకృతంగా దందా సాగిస్తున్నట్లు సమాచారం. నైజీరియన్లను పెడ్లర్స్‌గా మార్చుకుని వీరు వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. మాదకద్రవ్యాల వినియోగంలో గంజాయి, చెరస్, కొకైన్‌ మొదటి మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి. 

నార్కొటిక్స్‌ వినియోగమే ఎక్కువ...
చెలామణిలో ఉన్న మాదకద్రవ్యాల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. చెట్ల నుంచి లభించే పదార్థాలతో తయారయ్యే నార్కోటిక్‌ సబ్‌స్టాన్సస్, ప్రయోగశాలల్లో తయారు చేసే సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సస్‌. గాంజ (గంజాయి), ఓపియం (నల్లమందు), కొకైన్‌లతో పాటు గంజాయితో తయారు చేసే చెరస్, హషీష్‌ ఆయిల్, బంగ్, నల్లమందు ద్వారా ఉత్పత్తి చేసే బ్రౌన్‌ షుగర్, హెరాయిన్‌... ఇవన్నీ నార్కొటిక్స్‌ కిందకి వస్తాయి. కెటామిన్, ఎపిడ్రిన్, పెథిడిన్‌ తదితరాలు సైకోట్రోపిక్స్‌ కోవకు చెందుతాయి. రాజధానిలో నార్కోటిక్స్‌ వినియోగమే ఎక్కువగా ఉండగా వీటిలోనూ గాంజ, చెరస్, కొకైన్‌లను విచ్చలవిడిగా వాడుతున్నారు. 

లోకల్, ఇంపోర్టెడ్‌...
నార్కోటిక్స్‌లో గాంజకు సంబంధించిన ఉత్ప త్తులు ప్రధానంగా హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి సరఫరా అవుతున్నాయి. వరంగల్, మెదక్, జహీరాబాద్‌లతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా జరుగుతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో పండే గంజాయితో పాటు అక్కడ తయారయ్యే చెరస్, హషీష్‌ ఆయిల్‌కు మంచి డిమాండ్‌ ఉంది. వీటి వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ... ఓపియం సహా దాని సంబంధిత ఉత్పత్తులైన బ్రౌన్‌షుగర్, హెరాయిన్‌ల చెలామణి తక్కువగా ఉంటోంది. కోకా చెట్టు నుంచి తీసే కొకైన్‌ కేవలం దక్షిణ అమెరికాలోనే ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. 

షిప్‌మెంట్‌ ద్వారా రవాణా...
కొకైన్‌ను గతంలో విమానాల ద్వారా స్మగ్లింగ్‌ చేసే వారు. అయితే ఇటీవలి కాలంలో విమానాశ్రయాల్లో నిఘా పెరగడంతో షిప్‌మెంట్స్‌ ద్వారా రప్పిస్తున్నారు. దక్షిణ అమెరికా నుంచి హాంకాంగ్‌కు అక్కడి నుంచి భారత్‌కు వచ్చి చేరుతోంది. దీనిని పలు రకాలుగా రవాణా చేస్తున్నప్పటికీ... ఇటీవల కాలంలో ‘పుస్తక రవాణా’ పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. తెల్లని పొడిలా ఉండే కొకైన్‌ను బౌండ్‌ పుస్తకాల పేజీలకు పూత మాదిరి పూస్తున్నారు. అలా ఒక్కో పుస్తకంలోనూ దాదాపు 200 గ్రాముల వరకు పూత పూయవచ్చు. ఆ పుస్తకాలను పార్శిల్‌ చేసి లేదా మహిళా ట్రాన్స్‌పోర్టర్ల ద్వారా షిప్పుల్లో భారత్‌కు చేరుస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లపై ఆ పొడిని దులిపి ప్యాక్‌ చేసి విక్రయిస్తారు. 

నైజీరియన్‌ మాఫియా...
ముంబై, గోవా, ఢిల్లీ, ఛండీఘడ్‌ ప్రాంతాల్లో డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించి ప్రధాన డీలర్లు ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వీరి డ్రగ్‌ నెట్‌వర్క్‌లో నైజీరియన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని  వివిధ వీసాలపై భారత్‌ రప్పిస్తున్నారు. అలా వచ్చిన వారి పాస్‌పోర్టులను డిపాజిట్‌ చేయించుకుని వివిధ నగరాల్లో ప్లేస్‌మెంట్స్‌ ఇస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రిటైల్‌ వ్యాపారం వీరికి అప్పగిస్తూ బస్సులు, రైళ్ల ద్వారా డ్రగ్‌ను అక్కడికి చేరుస్తున్నారు. విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని హోల్‌సేల్‌ పెడలర్స్‌కు పంప డం, వారిచ్చే కమీషన్‌ తీసుకోవడం వీరి పని. ఈ నైజీరియన్లు పట్టుబడినప్పటికీ తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ గుర్తింపును హోల్‌సేలర్లు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.

వీకెండ్స్‌లో భారీ డిమాండ్‌...
ఈ మాదకద్రవ్యాలకు వీకెండ్స్‌లో భారీ డిమాండ్‌ ఉంటోంది. శని, ఆదివారాల్లో రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు పెడలర్స్‌ వ్యాపారం చేస్తుంటారు. ఫోన్‌కాల్స్‌పై వచ్చే ఆర్డర్స్‌ ఆధారంగా కేవలం పరిచయస్తులకు మాత్రమే వీటిని విక్రయిస్తారు.  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లతో పాటు పంజగుట్ట ప్రాంతాల్లోని వీఐపీలు, సినీ ప్రముఖులతో పాటు వారి పిల్లలువీటిని ఎక్కువగా వినియోగిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. నగరంలోని పబ్‌లతోపాటు శివార్లలోని ఫామ్‌హౌస్‌లు, రిసార్టుల్లో జరిగే రేవ్‌ పార్టీల్లో వీటి వినియోగం సర్వసాధారణమైంది.

రీటైల్‌ డ్రగ్స్‌ మార్కెట్‌...
గంజాయి: రూ.4 వేల నుంచి రూ.5 వేలు (కేజీ)
చెరస్‌: రూ.60 వేల నుంచి రూ. లక్ష (కేజీ)
హషీష్‌ ఆయిల్‌: రూ.80 వేల నుంచి రూ.1.2 లక్షలు (కేజీ)
బంగ్‌: రూ.50 నుంచి రూ.70 (ఒక్కో టాబ్లెట్‌)
కొకైన్‌: రూ.5 వేల నుంచి రూ.10 వేలు (గ్రాము)
బ్రౌన్‌షుగర్‌: రూ.12 వేల నుంచి రూ.15 వేలు (గ్రాము)
హెరాయిన్‌: రూ.11 వేల నుంచి రూ.18 వేలు (గ్రాము)

మారుపేర్లు, ప్రభావాలు...
హెరాయిన్‌:  బ్లాక్‌ ట్రా, చివా, నెగ్రా, హార్స్‌ మారుపేర్లు. కరగబెట్టి ఇంజెక్షన్‌ చేసుకోవడం (ఇంజెక్టింగ్‌), ముక్కుతో పీల్చడం (నోజింగ్‌), సిగరెట్‌లో నింపుకుని కాల్చడం (స్మోకింగ్‌) ద్వారా సేవిస్తారు. హెరాయిన్‌ను ఎక్కువగా వినియోగిస్తే శ్వాసకోస వ్యాధులు, చర్మ వ్యాధులతో పాటు కోమాలోకి వెళ్లి మరణం సైతం సంభవిస్తుంది.
కొకైన్‌:  స్టఫ్, కోకి, ఫ్లాకీ, స్నో, కోకా, సోడా మారుపేర్లు. ముక్కుతో పీల్చడం, సిగరెట్‌లో నింపుకుని కాల్చడం, వైన్‌లో కలుపుకుని తాగడం (స్పైకింగ్‌) ద్వారా సేవిస్తారు. దీని వినియోగం పెరగడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో పాటు అల్జీమర్స్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. గండె సంబంధ వ్యాధులు త్వరగా వస్తాయి.  
గాంజ, చెరస్‌:  ఓ మాల్‌గా ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆకులను సిగరెట్‌లో నింపుకుని కాలుస్తారు. ఈ చెట్టు నుంచి కారే బంక నుంచి చెరస్‌ ఉత్పత్తి అవుతుంది. దీని నేరుగా తీసుకోవడం లేదా సిగరెట్‌ ద్వారా సేవిస్తారు. ఇవి ఊపిరితిత్తులు, మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement