ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కురబలకోట(చిత్తూరు జిల్లా): హైదరాబాద్ కూకట్‌పల్లి నుంచి వచ్చేసిన ఓ జంటను గురువారం ముదివేడు పోలీసులు హైదరాబాదు పోలీసులకు అప్పగించారు. స్థానిక ఎస్‌ఐ సుకుమార్ కథనం.. కురబలకోట మండలం అడవికుంటకు చెందిన రవి (35) పదేళ్లుగా హైదరాబాద్‌లో మేస్త్రీగా స్థిరపడ్డారు. ఇతనికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. అతని వద్ద కూకట్‌పల్లికు చెందిన మంజుల (25) బేల్దారి పనికి వెళ్లేది. ఈమెకు కూడా పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. ఒకే చోట భవన నిర్మాణ పనులు చేస్తున్న వీరు పరస్పరం ఇష్టపడ్డారు. ఒకరికొకరు దగ్గరయ్యారు. దూరంగా వెళ్లిపోయి కలసి జీవించాలని నిశ్చయించుకున్నారు. దీంతో ఇటీవల మంజుల తన ఇద్దరి పిల్లలను తీసుకుని మేస్త్రీ రవితో కలసి కురబలకోట మండలంలోని అంగళ్లుకు చేరుకున్నారు.
ఇక్కడ అద్దెకు రూము తీసుకుని బేల్దారి పనులకు వెళ్లేవారు. ఈ నేపథ్యంలో, మంజుల పిల్లలతో సహా అదృశ్యం కావడంపై ఆమె కుటుంబ సభ్యులు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 5న మిస్సింగ్ కేసు నమోదైంది. అక్కడి పోలీసులు అనుమానంతో మేస్త్రీ రవి సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆరా తీశారు. అతను అంగళ్లులో ఉన్నట్లు తెలుసుకున్నారు. కూకట్‌పల్లి ఏఎస్‌ఐ మన్యం గురువారం ఇక్కడికి వచ్చారు. స్థానిక పోలీసుల సహకారంతో ‘సహజీవనం జంట’ను పట్టుకున్నారు. ఇదే రోజు రాత్రి వారిని హైదరాబాదుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment