
ప్రశాంతి (ఫైల్)
హయత్‌నగర్: పక్క పోర్షన్‌లో నివసించే వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడాన్ని అవమానంగా భావించిన ఓ గృహిణి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పవనగిరి కాలనీలో నివసించే కొమిరెల్లి రమేశ్‌రెడ్డి ఆర్టీసీ డ్రైవర్. అతని భార్య ప్రశాంతి (24) గృహిణి. వారికి ఓ బాబు, పాప ఉన్నారు.
శనివారం రాత్రి 9 గంటలకు మృతురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పక్క పోర్షన్‌లో నివసించే కుంచాల నరేష్ అనే వ్యక్తి ఆమె ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఆమె బయటికి పరుగులు తీసి ఇంటి ఓనర్‌కు విషయం చెప్పింది. దీనిని అవమానంగా భావించిన ప్రశాంతి తన బాబును బయటికి పంపించి పాప నిద్ర పోతున్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు కారణమైన నరేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.