రమ్య(ఫైల్)
యశవంతపుర : కట్నం వేధింపుల నేపథ్యంలో ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా భర్త, ఆమె అత్త మామలు తీవ్రంగా హింసించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన రాజగోపాలనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సుంకదకట్ట సంజీవినినగరకు చెందిన మంజునాథ్‌కు మూడేళ్ల క్రితం రమ్య అనే యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో మంజునాథ్‌కు అత్తింటవారు ఘనంగా కట్నకానుకలు సమర్పించారు. పెళైయిన మూడు నెలల వరకు దాంపత్య జీవనం సుఖంగా సాగింది.
ఆ తర్వాత రమ్యకు వేధింపులు మొదలైనట్లు ఆరోపణలున్నాయి.ఈ నేపథ్యంలో రమ్య శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న రమ్య తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. కట్నం తేవాలని తరచూ తమ కుమార్తెను ఆమె భర్త, అత్తమామలు హింసించేవారని పేర్కొన్నారు. భర్త తాగి వచ్చి తీవ్రంగా కొట్టేవారన్నారు. రమ్య బాధలు చూడలేక పలుమార్లు డబ్బు ఇచ్చి పంపామని, అయితే మరింత కట్నం తేవాలని కొంతకాలంగా వేధింపులును తీవ్రతరం చేశారన్నారు. ఈక్రమంలో తమకుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు మంజునాథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment