రామకృష్ణమ్మ పెళ్లినాటి ఫొటో(ఫైల్)
కర్నూలు, కృష్ణగిరి: ఆరు రోజుల కిత్రం అదృశ్యమైన మహిళ బుధవారం హంద్రీ కాలువలో శవమై తేలింది. మృతురాలి తలపై గాయం ఉండటంతో భర్తే హత్య చేసి కాలువలో పడేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన సుధాకర్‌కు ఎరుకలచెర్వు గ్రామానికి చెందిన రామకృష్ణమ్మ(23)కు మూడేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఏడాది పాప ఉంది. ఈ నెల 7న సాయంత్రం పొలం వద్దకు నీరు పెట్టేందుకు దంపతులిద్దరూ వెళ్లారు. ఆ తర్వాత రామకృష్ణమ్మ ఇంటికి రాలేదు.
మరుసటి రోజు రామకృష్ణమ్మ అదృశ్యమైనట్లు తల్లి నాగ తిమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మూడు రోజులుగా పోలీసులు హంద్రీనీవా కాలువ, పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. భర్తను సైతం అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా బుధవారం హంద్రీనీవా కాలువలో గుండ్లకొండ పంప్‌హౌస్ వద్ద రామకృష్ణమ్మ శవమై తేలింది. విషయం తెలుసుకున్న డోన్ సీఐ సుధాకర్‌రెడ్డి, కృష్ణగిరి ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. డోన్ వైద్యులతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య లక్కసాగరంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులుతెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment