మహాలక్ష్మీ, మహిధర్‌ల పెళ్లినాటి ఫొటో
అనంతపురం సెంట్రల్: నగరంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు అంటుండగా.. అదనపు కట్నం కోసం చంపేశారంటూ పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నల్లచెలిమలకు చెందిన మురళి, రమాదేవి దంపతుల ఏకైక కుమార్తె మహాలక్ష్మి (22)ని అనంతపురంలోని బళ్లారి రోడ్డు ఆంజనేయనగర్‌లో నివాసముంటున్న దశరథరామయ్య, శారదమ్మ (ప్రభుత్వ టీచర్) దంపతుల కుమారుడు మహిధర్‌కు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. రూ.5 లక్షల నగదు, 20 తులాల బంగారు కట్నకానుకల కింద ఇచ్చారు. తొలినాళ్లలో దంపతులు అన్యోన్యంగా ఉన్నా ‘కట్న పిశాచి’ వీరి కాపురంలో చిచ్చుపెట్టింది. అదనపు కట్నం తీసుకురమ్మని అత్తింటివారు కొద్ది నెలలుగా మహాలక్ష్మిని వేధించేవారు.
పుట్టింటికి రా చెల్లి..
అత్తారింటిలో మహాలక్ష్మిని వేధిస్తున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకురమ్మని ఆమె సోదరున్ని అనంతపురం పంపించారు. మంగళవారం వచ్చిన అతడు అక్కను తమ ఊరికి తీసుకెళతామని బతిమలాడాడు. ఇందుకు భర్త మహిధర్, అత్తమామలు ససేమిరా అనడంతో సోదరుడు ప్రసాద్ బుధవారం కర్నూలు జిల్లాకు తిరుగుపయనమయ్యాడు. ఉదయం 10 గంటలకు ఇంటినుంచి బయటకు వచ్చి ఆర్టీసీ బస్టాండ్‌లో కర్నూలు బస్సు ఎక్కాడు. వడియంపేట సమీపంలోకి వెళ్లగానే ప్రసాద్‌కు ఫోన్ వచ్చింది ‘మీ అక్క ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది’ అని.
అత్తింటివారే చంపేశారు!
భర్త, అత్తమామలే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మహాలక్ష్మి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లు కూడా లేవని తెలిపారు. ముమ్మాటికీ తమ బిడ్డను చంపేశారని నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. భర్త తరఫు బంధువులు మాత్రం ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ అన్వర్‌హుస్సేన్ సమక్షంలో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అదనపు కట్నం కోసం వేధించారని, ఇటీవలే కలర్ టీవీ కొనిచ్చామని, ఇప్పుడు ఏసీ కావాలని అల్లుడు ఒత్తిడి చేశాడని ఆరోపించారు. అదనపు కట్నం కోసం తమ బిడ్డను వేధించడం వలనే చనిపోయిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నాల్గవ పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్‌శ్రీనివాస్ తెలిపారు. భర్త, అత్త, మామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment