భర్త గోపీకృష్ణతో ఉమ(ఫైల్ ఫొటో) తల్లి మరణించిన విషయం తెలియక తాత ఒడిలో పిల్లలు
రాత్రి అందరిలానే నిద్రపోయిన ఆ తల్లి ఇకలేవలేదు.. తెల్లారేసరికి కిటికీ ఊచలకు నిర్జీవంగా వేలాడుతూ కనిపించింది. రాత్రి ఇంట్లోనే ఉన్న తండ్రి అయిపూఅజా లేకుండా పోయాడు.. అభం శుభం తెలియని ఆ పిల్లలు తల్లిలో చలనం లేక, తండ్రి కనిపించక తల్లడిల్లిపోయారు.. ఆరిలోవ రవీంద్రనగర్‌లో జరిగిన గృహిణి అనుమానాస్పద మృతి ఘటన.. పిల్లల ఆక్రందన స్థానికులను కలచివేసింది.
ఆరిలోవ(విశాఖ తూర్పు): తెల్లారక ముందే టిఫిన్ తయారు చేసి బలవంతంగా నిద్ర లేపే అమ్మ.. ఈ రోజు ఎంత లేపినా ఎందుకు లేవడం లేదో ఆ చిన్నారులకు తెలియడం లేదు. వద్దు వద్దు అంటున్నా వెంట పడి తినిపించే తల్లి ఆకలేస్తోందని ఎంత ఏడుస్తున్నా కన్నెత్తి చూడడం లేదు. చిన్న అరుపు వినిపిస్తే ఏమైందోనని కంగారు పడి పరుగెత్తే అమ్మ గుక్కపట్టి ఏడుస్తున్నా పక్కకు కదలడం లేదు.. ఏమైందో చెప్పడానికి నాన్న కూడా కనపడకుండా పోయాడు.. మాటలైనా రాని ఆ పసివాళ్ల హృదయ ఘోష చుట్టూ ఉన్న వారి మనసును కలిచివేసింది..
ఓ గృహిణి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బంధువులకు తెలియజేసి పరారైన మృతురాలి భర్త తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లా చీపురుపల్లి దరి పెంటలింగాపురానికి చెందిన బమ్మడిపాటి గోపీకృష్ణ కిరణ్‌కుమార్‌కు, అదే జిల్లా గరివిడి దరి పెదబంటుపల్లికి చెందిన ఉమ(26)తో 2012లో వివాహమైంది. గోపీకృష్ణ నగరంలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పని చేస్తున్నాడు. వీరికి ఐదేళ్లు, రెండేళ్లు వయస్సున్న సాయి, లడ్డూ అనే మగపిల్లలున్నారు. వీరంతా కొన్నాళ్లుగా మూడో వార్డు పరిధి రవీంద్రనగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఇంట్లో చిన్నచిన్న గొడవలు అప్పుడప్పుడూ జరుగుతుండేవని స్థానికులు చెప్పారు. అయితే ఈ గొడవలు పెద్దల వరకు చేరలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారేసరికి ఉమా చీరతో కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఆమె భర్త గోపీకృష్ణ వరసకు తోడల్లుడు అయ్యే బంధువుకు ‘ఉమా ఆత్మహత్య చేసుకొంది.. వెంటనే రావలెను’ అని సెల్‌ఫోన్‌లో మెసేజ్ చేశారు. అనంతనం అక్కడే మృతదేహాన్ని, నిద్రపోతున్న చిన్నారులను వదిలేసి పరారయ్యాడు. తెల్లవారి లేచిన పిల్లలు తల్లిన లేపినా లేవకపోవడంతో ఆకలితో గోలపెట్టారు. ఇంతలో ఫోన్ మెసేజ్ ద్వారా నగరంలో అందుబాటులో ఉన్న వారి బంధువులు చేరుకుని ఆ చిన్నారులను చేరదీశారు.
అనంతరం విజయనగరం నుంచి మృతురాలి తల్లిదండ్రులు, అత్తమామలు అక్కడికి చేరుకున్నారు. ఏసీపీ రామచంద్రరావు, ఆరిలోవ సీఐ సీహెచ్.తిరుపతారావు, ఎస్‌ఐ పాపారావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. బంధువుల అనుమతితో మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
అల్లుడే చంపేసి ఉంటాడు..
తన కుమార్తె ఉమా(26)ను అల్లుడు గోపీకృ ష్ణ చంపేసి ఉంటాడని, అందుకే పిల్లల్ని సైతం విడిచిపెట్టి ఎక్కడికో పారిపోయాడని మృతురాలి తండ్రి ఎన్.సూర్యప్రకాష్ ఆరిలోవ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో తగిన విధంగా కట్నకానుకులు ఇచ్చుకొన్నామ ని, అయినా కట్నం సరిపోక అదనంగా మరిం త కట్నం అడిగేవాడని ఫిర్యాదులో పేర్కొన్నా రు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానా స్పద కేసుతో పాటు మృతురాలి భర్తపై 498ఏ కేసు నమోదు చేసినట్టు సీ.ఐ తిరుపతిరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపడుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment