భర్త, కుటుంబ సభ్యులతో ప్రియాంక పెళ్లినాటి ఫొటో
సాక్షి, చిత్తూరు అర్బన్ : పెళ్లయిన నాలుగు నెలలకే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన సోమవారం కొంగారెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి భర్త పారిపోవడం, ఫోన్ తీయకపోవడంతో మృతురాలి కుటుంబ సభ్యులు అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు.. నగరంలోని కొంగారెడ్డిపల్లెకు చెందిన దొరస్వామి, కళావతిల కుమార్తె ప్రియాంక(24)ను గంగాధరనెల్లూరు మండలం కె.వెంకటాపురానికి చెందిన మధు(28)కు ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 24న చిత్తూరులో పెళ్లి చేశారు. మధు కట్టమంచిలోని ఓ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం గంగాధరనెల్లూరు నుంచి దంపతులిద్దరూ కొంగారెడ్డిపల్లెకు వచ్చారు.
మృతురాలి తల్లిదండ్రులు బయట కూలి పనికి వెళ్లారు. ఇక్కడ ఏం జరిగిందో ఏమో గానీ.. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రియాంక బంధువులు ఇంటికి వెళ్లి చూడగా.. స్నానాల గదిలో ఆమె ఆచేతనంగా పడుంది. మెడకు చున్నీ చుట్టి ఉన్నారు. చుట్టుపక్కల వారి సాయంతో ప్రియాంకను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈమె భర్త ఎవరికీ చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫోన్ చేసినా తీయడం లేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, వన్‌టౌన్ సీఐ శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు డీఎస్పీ వెంకట రామాంజనేయులు ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. తన కూతుర్ని అల్లుడు మధునే చంపేశాడంటూ మృతురాలి బంధువులు పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment