సంధ్య మృతదేహం, సంధ్య భర్తతో(ఫైల్)
సాక్షి, విశాఖపట్నం : ఆ నవ వధువు జీవితం మూణ్ణాళ్ల ముచ్చటైంది. కాళ్ల పారాణి ఆరకముందే మృత్యు ఒడికి చేరింది. భార్యభర్తల నడుమ వచ్చిన చిన్నపాటి గొడవకే ఉరివేసుకుందని భర్త చెబుతుండగా, భర్తే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను చంపేశాడని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఎల్‌బి పురం గ్రామానికి చెందిన నవ వధువు పర్రె సంధ్య(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన పర్రె కొండబాబు, ఈశ్వరమ్మల కుమారుడు రాజుకు, చోడవరం మండలం నరసయ్యపేట గ్రామానికి చెందిన గంట్ల అప్పారావు, క్రిష్ణవేణిల కుమార్తె సంధ్యకు నాలుగు నెలల క్రితం పెళ్లయింది. రాజు విశాఖలో స్టీల్‌ప్లాంటులో ప్రవేటుగా ఉద్యోగం చేస్తున్నాడు. గాజువాకలో అద్దె ఇంట్లో రాజు, సంధ్య కొత్త కాపురం పెట్టారు. శనివారం సాయంత్రం భార్యభర్తల మధ్య కొద్దిపాటి గొడవ జరిగిందని, గొడవ జరిగిన వెంటనే తాను ఇంటి నుంచి బయటకెళ్లి వచ్చేసరికి సంధ్య ఫ్యాన్‌కు ఊరేసుకొని కనిపించిందని రాజు చెబుతున్నాడు.
స్థానికుల సాయంతో సంధ్యను కిందికి దించి ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ప్రవేటు ఆస్పత్రికి తరలించామని, అయితే వైద్యులు కేజిహెచ్‌కు తరలించాలని సూచించగా, ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయిందని తెలిపాడు. శనివారం రాత్రి సంధ్య మృతదేహాన్ని స్వగ్రామం ఎల్‌బి పురం తీసుకొచ్చి అత్తమామలకు ఈ విషయం తెలిపాడు. నాలుగు నెలలకే తన కుమార్తె చావు కబురు వినడంతో సంధ్య తల్లిదండ్రులు భోరున విలపించారు. సంధ్య ఒంటిపైన గాయాలు, చేయి విరిగినట్టు ఉండడంతో భర్తే చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కుమార్తెను అదనపు కట్నం కోసం అల్లుడే చంపేశాడని ఆగ్రహం చెందడమే కాక రాజుపై, అతని తల్లిదండ్రులపైన దాడికి దిగారు. బుచ్చెయ్యపేట పోలీసులు రాజును అదుపులోకి తీసుకొని గాజువాక పోలీసులకు అప్పగించారు. గాజువాకలో సంఘటన జరగడంతో అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు మృతురాలి తల్లిదండ్రులకు తెలిపి సంధ్య మృత దేహాన్ని విశాఖ కేజిహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment