చెట్టుకు వేలాడుతున్న లక్ష్మణరావు మృతదేహం, సంఘటన స్థలంలో పడిఉన్న గుర్తింపు కార్డులు
గోపాలపట్నం: ఓ కారుడ్రైవరు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన గోపాలపట్నంలో సంచలనంగా మారింది. ఉరిపోసుకుని మరణించినట్లు బయటకు కనిపించినా ఆత్మహత్యకు పాల్పడేటంతటి పిరికి బంద కాదని మృతుని భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకి వెళితే..గోపాలపట్నం శివారు యల్లపువానిపాలెం సంతోష్‌నగర్ రైలు ట్రాకుల వద్ద చెట్టుకి ఓ వ్యక్తి ఉరిపోసుకుని ఉన్నట్లు గురువారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ పైడియ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ మహంతి శ్రీనివాస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. మృతదేహం సమీపంలో గుర్తింపు కార్డులు కనిపించాయి. గుర్తింపు కార్డుల ఆధారంగా మృతుడు నెయ్యిల లక్ష్మణరావు (42)గా గుర్తించారు. కార్డుల సాయంతో అతని అడ్రసు కనుగొన్నారు. ఇతను వడ్లపూడిలోని రైల్వేక్వార్టర్స్ వద్ద నివాసం ఉంటున్నట్టు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి కేజీహెచ్‌కి తరలించారు. సంఘటనా స్థలంలో లభ్యం అయిన కార్డుల్లో ఈశ్వరరావు అనే న్యాయవాది కార్డు కూడా ఉంది.
విషాదంలో మృతుని కుటుంబం
లక్ష్మణరావు మృతిచెందాడన్న సమాచారంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుని భార్య అరుణని గోపాలపట్నం పోలీసులు విచారించారు. తన భర్త ఓ న్యాయవాది వద్ద కారు డ్రైవరుగా పని చేస్తున్నాడని, ముందూమునుపూ ఎవరితోనూ వివాదాలు లేవని చెప్పింది. తమకు పదమూడేళ్ల కుమార్తె ఉందని, ఇంత వరకూ అన్యోన్యంగానే ఉన్నామని, కుటుంబ కలహాల్లేవని, అప్పులు వంటివి కూడా ఆమె తెలిపింది. పోస్టు మార్టం నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment