
మేఘన (ఫైల్)
యశవంతపుర : ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థిని మేఘనను ర్యాగింగ్ చేస్తున్న రెండు వీడియోలో బయటపడ్డాయి. దీంతో కర్ణాటక మహిళ కమిషన్ మేఘన ఆత్మహత్య కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. గురువారం ఉదయం మేఘన ను ర్యాగింగ్ చేస్తున్న రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. మొదట మేఘన ఆత్మహత్యకు, కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్న దయానంద సాగర కళాశాల యాజమాన్యం, కళాశాల ఆవరణలో మధ్యాహ్నం మేఘనను తోటి విద్యార్థిని, విద్యార్థులు అవమానంగా మాట్లాడటం, దుర్భాషలాడటం, దాడి చేయడానికి యత్నించిన వీడియోలు బయటపడ్డాయి.
ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా హల్‌చల్ చేస్తున్నాయి. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి మొబైళ్లను తీసుకుని పరిశీలించగా ర్యాగింగ్ దృశ్యాలు బయటపడినట్లు విచారణలో తేలింది. దీంతో మేఘన తల్లిదండ్రులకు బలం చేకూరింది. మేఘన ఆత్మహత్యకు కారణమైన విద్యార్థులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తోటి విద్యార్థినిని అమర్యాదగా మాట్లాడటం సిగ్గుచేటు: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ తోటి విద్యార్థినిని సహచరులే అమర్యాదగా మాట్లాడటం సిగ్గు చేటని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి అన్నారు. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేస్తున్నట్లు చెప్పారు.