సాక్షి, హిమాయత్‌నగర్: వృత్తిరిత్యా కూలిపనులు చేసుకునే ఆరుగురు యువకులు చోరీలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నారు. జల్సాల కోసం ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహానాలు దొంగిలిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఆరుగురిలో ఇద్దరు మేజర్‌లు కాగా..నలుగురు మైనర్‌లు ఉన్నారు. వీరిలో ముగ్గురు జైలుకు వెళ్లి వచ్చినా తమ పంథా మార్చుకోలేదు.
తాజాగా నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడి నుంచి సెల్‌ఫోన్, నగదు దోపిడీ చేసి సీసీపుటేజీ ఆధారంగా కొన్ని గంటల్లోనే పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన అనూజ్‌ప్రసాద్ హైటెక్‌సిటీలో క్యాటరింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ నెల 26 రాత్రి అతను లిబర్టీ సిగ్నల్ నుంచి నారాయణగూడ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఉన్న బస్టాప్‌కు వచ్చాడు. అయితే హైటెక్ సిటీకి వెళ్లేందుకు బస్సులేకపోవడంతో బస్టాప్‌లోనే పడుకున్నాడు.
అర్థరాత్రి రాంనగర్ ఫిష్‌మార్కెట్ ప్రాంతానికి చెందిన చంద్రకాంత్, మధు, సోహల్, గౌతమ్, రంజిత్, షరీఫ్ రెండు బైక్‌లపై వచ్చి అనూజ్‌ప్రసాద్‌ను బెదిరించి అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, పర్సు, రూ.150 నగదు లాక్కుని పరారయ్యారు. వీరిలో చంద్రకాంత్, మధు మేజర్లు కాగా, మిగతా నలుగురూ మైనర్‌లు కావడం గమనార్హం. మరుసటి రోజు బాధితుడు అనూజ్‌ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ పుటేజీల ద్వారా గుర్తింపు..
సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు సెల్‌ఫోన్ చోరీ అనంతరం నిందితులు రాంనగర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. రాంనగర్ ఫిష్‌మార్కెట్ వద్ద స్థానికులను విచారించగా నిందితులపై కీలక సమాచారం అదించారు. దీంతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. షరీఫ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
అందరికీ నేరరచరిత్ర..
పోలీసు స్టేషన్‌లో పోలీసులు నిందితులను విచారించగా పలు చోరీలు వెలుగులోకి వచ్చాయి. సోహల్, చంద్రకాంత్, మధు నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. చంద్రకాంత్ ఉప్పల్ పీఎస్ పరిధిలో ల్యాప్‌టాప్‌లు దొంగిలించి రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చా డు. మధు చిక్కడపల్లి, నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలో బైక్, ల్యాప్‌టాప్ చోరీ కేసులో పోలీసులకు పట్టుబడటంతో రెండు సార్లు జైలుకు వెళ్లాడు. సోహాల్ గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో నగదు, సెల్‌ఫోన్లు చోరీ చేసి జైలుకు వెళ్లాడు.
గంజాయి కోసమే..
గంజాయికి అలవాటు పడిన వీరు డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మధు కార్‌వాషింగ్‌లో పనిచేస్తుండగా.. సోహల్ మటన్‌షాప్‌లో పనిచేస్తున్నాడు. వీరు మిగతా నలుగురితో కలిసి గంజాయి తాగేవారు. గంజాయి కొనేందుకు చోరీలకు పాల్పడుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment