సాక్షి, విజయవాడ: పట్టపగలే దొంగతనాలు చేయటంలో ఆరితేరారు ఆ ఐదుగురు మిత్రులు. మూతిమీద మీసం కూడా సరిగ్గా మొలవకముందే వరుస చోరీలతో జనాన్ని బెంబేలెత్తించారు. పోలీసులకూ సవాలు విసిరారు. పాపం పండటంతో ఎట్టకేలకు పట్టుబడి జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు.
కొద్దిరోజులుగా పగటిపూట దొంగతనాలకు పాల్పడుతూ విజయవాడ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన బుడత బ్యాచ్‌ని పోలీసులు పట్టేశారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ పంచ పాండవులని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. చెడువ్యసనాలకి బానిసలమై ఈజీ మనీ ఎర్నింగ్ కోసం దొంగల అవతారం ఎత్తామని సదరు ఐదుగురు మిత్రులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇప్పటివరకు విజయవాడ, ఉయ్యురు, పెనమలూరు, తోట్ల వల్లూరు ప్రాంతాల్లో పగటిపూట తొమ్మిది దొంగతనాలకు పాల్పడినట్టు ఒప్పుకొన్నారు. వీధుల్లో రెక్కీ నిర్వహించి నిశితంగా పరిశీలించాక ఎవరూ లేరని నిర్ధారించుకొని గొళ్లాలను విరగకొట్టి ఈ ముఠా దొంగతనాలు చేసేదని డీసీపీ తెలిపారు.
ఇక, బ్రహ్మోత్సవాల సందర్భంగా సిటీలోకి ఎంట్రీ ఇచ్చి భక్తులను బెంబేలెత్తిస్తున్న జేబు దొంగల ముఠా గుట్టును కూడా పోలీసులు రట్టు చేశారు. మఫ్టీ పోలీస్ బృందాలను ఏర్పాటుచేసి ఈ ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. వీరు మొత్తం ఎనిమిది నేరాలకు పాల్పడ్డారు. పట్టుబడ్డ రెండుగ్యాంగుల నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల విలువచేసే బంగారం, నగదు స్వాధీనం చేసుకొన్నామని, బాలనేరస్థులని జువైనల్ హోమ్‌కు, పాత నేరస్తులను జిల్లా జైలుకి తరలించామని క్రైమ్ డీసీపీ కోటేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment