జయనగర: అక్రమంగా నిర్వహిస్తున్న గోవధ కబేళాపై ఫిర్యాదు చేసినందుకు దాడికి గురైన మహిళా ఐటీ ఇంజినీర్ నందిని వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీనిపై ఇప్పటివరకు వెలుగులోకి వచ్చినవన్నీ అవాస్తవాలనీ పోలీసు పెద్దలు కొట్టిపారేశారు. నందిని కేసులో ముగ్గురిని, యలహంకలో కబేళా తనిఖీల్లో పోలీసులపై దాడి చేసిన కేసులో మరో 10 మందిని అరెస్ట్ చేశామని నగర పోలీస్‌కమిషనర్ సునీల్‌కుమార్ తెలిపారు. బుధవారం నగర కమిషనరేట్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత శనివారం సిటీలో తలఘట్టపుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆవలహళ్లిలో మహిళా టెక్కీ నందినిపై దుండగులు దాడికి పాల్పడినట్లు బాధితురాలు చెబుతున్నారు.
ఆమె కారు ధ్వంసం కాగా, కుడిచేతికి గాయాలు కూడా తగిలినట్లు ఆమె మీడియా ముందు ప్రకటించారు. అయితే దాడి ఘటనలో కొత్త విషయాలను కమిషనర్ వెల్లడించారు. మహిళా టెక్కీ నందినీపై గూండాల దాడి జరగలేదని, నందినీ కారు ఆటోను, మాంసం దుకాణాన్ని ఢీకొనడంతో స్థానికులు ఆమెపై దాడికి పాల్పడ్డారని కమిషనర్ చెప్పారు. కానీ నందిని గోవధపై తాను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినందుకే దుండగులు దౌర్జన్యం చేశారని ఫిర్యాదు చేసిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని కమిషనర్ తెలిపారు. తనపై దాడికి పాల్పడిన వారు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని నందీని ఆరోపించారని ఇది అవాస్తవమని అన్నారు. అలా ఎవరూ నినాదాలు చేయలేదని కమిషనర్ సునీల్‌కుమార్ స్పష్టం చేశారు.
మరో కబేళా కేసులో 10 మంది అరెస్టు
అలాగే మంగళవారం దొడ్డబెట్టహళ్లిలో ఉన్న కసాయిఖానా మూసివేయాలని నోటీస్ ఇచ్చిన పోలీసులపై దుండగులు దాడికి దిగడం జరిగిందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు నియమించిన కమిషన్, గోగ్యాస్ ఫౌండేషన్ సభ్యులు కసాయిఖానా వద్దకు వెళ్లగా కొందరు దాడికి పాల్పడ్డారన్నారు. 10 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఒక కారు, మినీ వ్యాన్‌ను సీజ్ చేసి, నాలుగు పశువులను రక్షించడం జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment