
చెన్నై,టీ.నగర్: మైనర్ బాలికను ప్రేమించి వివాహం చేసుకుని, గర్భవతిని చేసిన కేసులో నిందితుడిపై పోక్సో చట్టం ప్రయోగించేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. చెన్నై చూళైమేడుకు చెందిన 17 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలోగల పాఠశాలలో ప్లస్‌వన్ చదువుతూ వచ్చింది. ఈమె పాఠశాలకు వెళ్లి వస్తుండగా ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మన్నడికి చెందిన మహ్మద్ రియాస్ (28)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. బాలిక మైనర్ కావడంతో వీరి ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇదిలావుండగా ఈనెల ఎనిమిదో తేదీన ప్రేమజంట హఠాత్తుగా మాయమయ్యారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు చూలమేడు పోలీసు స్టేషన్‌లో మహ్మద్ రియాస్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చేపట్టారు.
వారు నాగపట్నంలో ఉన్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి ఇద్దరిని చెన్నైకు తీసుకువచ్చారు. బాలిక మైనర్ కావడంతో మహ్మద్ రియాస్‌ను థౌజండ్‌లైట్స్ మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఇదిలాఉండగా మహ్మద్ రియాస్‌ను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విద్యార్థిని వద్ద మేజిస్ట్రేట్ విచారణ జరిపారు. ఆ సమయంలో విద్యార్థిని మహ్మద్ రియాస్‌తోనే జీవిస్తానని తెలిపింది. దీంతో మేజిస్ట్రేట్ మహ్మద్ రియాస్‌ను పోక్సో చట్టం కింద జైలులో నిర్బంధించడం సాధ్యం కాదని వెల్లడించారు. దీంతో పోలీసులు గత్యంతరం లేకుండా మహ్మద్ రియాస్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.