మృతులు రామలక్ష్మి, సంగాని గీతాకృష్ణ
మనస్తాపం.. ఒక్క నిమిషం తమాయించుకుంటే.. ఎంతటి సమస్యకైనా కాలమే సమాధానమిస్తుంది. అలా నిగ్రహించుకోలేకపోతే.. వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటోయో.. ఈ తల్లి, కొడుకు ఆత్మహత్య ఉదంతం.. సాక్ష్యంగా నిలుస్తుంది. కాపురంలో చిన్నపాటి వివాదాలు. గతంలో అలిగి పుట్టింటికి వెళ్లి తిరిగి వచ్చేసిన ఆమె.. ఈసారి మాత్రం మనస్థాపంతో నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని వెళ్లిపోయింది. ఈసారీ అలాగే వస్తుందనుకున్న భర్త, బంధువులు.. వారిద్దరి మృతదేహాలు కంటపడేసరికి తల్లడిల్లిపోయారు. పల్లం గ్రామం బోరున విలపించింది. ఇదేమీ తెలియని మృతురాలి చిన్నారి.. అందరి వైపు చూస్తుంటే.. అతడిని చూసిన అందరు.. ఉబికివస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకోలేకపోయారు.
సాక్షి, కాట్రేనికోన (తూర్పు గోదావరి): పల్లం గ్రామానికి చెందిన సంగాని రామలక్ష్మి (22) కుమారుడు గీతాకృష్ణ (4)తో పాటు గోదావరి పాయలో పడి బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం ఈ గ్రామానికి చెందిన సంగాని నరసింహరాజు (చిన నరసింహులు)తో ఆరేళ్ల క్రితం రామలక్ష్మికి వివాహమైంది. వీరికి వివాహ బంధంలో ఇద్దరు పిల్లలు గీతాకృష్ణ (4) ఏడాది లోపు పాప ఉన్నారు. మృతురాలు రామలక్ష్మి సోదరుడు శేషాద్రి, ఆమె భర్త నరసింహరాజు మధ్య బుధవారం వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో రాత్రి భార్యాభర్తల మధ్య కూడా గొడవ తలెత్తడంతో విసుగు చెందిన ఆమె పుట్టింటికి వెళ్లిపోతానని, రాత్రి 12 గంటల సమయంలో కుమార్డు గీతా కృష్ణను తీసుకుని వెళ్లిపోయింది. గతంలో గొడవ పడి వెళ్లిపోయిన ఆమె బంధువుల ఇంటికి వెళ్లి ఆ తరువాత తిరిగి ఇంటి వెళ్లింది. అలాగే తిరిగి అవుతుందని అనుకున్నా.. ఆమె తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లకు వెళ్లి వెతికినా ఆమె లేకపోవడంతో పరిసరాల్లో వెతికారు.
గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి బాలుడి మృతదేహం గోదావరి పాయలో కనబడింది. వినాయక నిమజ్ఙనంలో ఎవరో బాలుడు మృతి చెంది ఉంటాడనుకున్నారు. భార్య, కొడుకు కోసం వెతుకు తున్న భర్త, వారి బంధువులకు గోదావరి పాయలో బాలుడి మృతదేహం ఉన్నట్టు తెలియడంతో అక్కడికి వెళ్లి చూసి గీతకృష్ణ మృతదేహంగా గుర్తించారు. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానించి.. గాలించడంతో భార్య రామలక్ష్మి మృతదేహం కూడా బయటపడింది. వృత్తి రీత్యా మృతురాలి భర్త చేపల వేట చేస్తుంటాడు. చేపలను తక్కువ ధరకు విక్రయిస్తున్నావని రోజూ కొట్టేవాడని, అతని వేధింపులతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు.
కంట తడిపెట్టిన గ్రామస్తులు
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఏడాది పాపను ఇంటి వద్దనే వదిలి కొడుకు గీతాకృష్ణతో పాటు రామలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడటంతో పల్లం గ్రామస్తులు కంటతడి పెట్టారు. బాలుడి మృతదేహంపై పడి బంధువులు రోధిస్తున్న తీరు అందరినీ కలసి వేసింది. రోజూ అందరితో ఆడుకొనే బాలుడు మృతి చెందడంతో అతడితో ఆడుకొనే చిన్నారులు బిక్కముఖాలతో కూర్చున్నారు. ఏమి జరిగిందో తెలియని మృతురాలి ఏడాది లోపు చిన్నారి.. అక్కడి అందరినీ చూస్తూ కూర్చోవడం.. చూపరులకు దుఃఖాన్ని కలిగించింది. ఈ ఘటనపై కాట్రేనికోన ఏఎస్సై వి.నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment