pallam
-
కలతల కల్లోలంలో.. తల్లీ బిడ్డల ఆత్మహత్య
మనస్తాపం.. ఒక్క నిమిషం తమాయించుకుంటే.. ఎంతటి సమస్యకైనా కాలమే సమాధానమిస్తుంది. అలా నిగ్రహించుకోలేకపోతే.. వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటోయో.. ఈ తల్లి, కొడుకు ఆత్మహత్య ఉదంతం.. సాక్ష్యంగా నిలుస్తుంది. కాపురంలో చిన్నపాటి వివాదాలు. గతంలో అలిగి పుట్టింటికి వెళ్లి తిరిగి వచ్చేసిన ఆమె.. ఈసారి మాత్రం మనస్థాపంతో నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని వెళ్లిపోయింది. ఈసారీ అలాగే వస్తుందనుకున్న భర్త, బంధువులు.. వారిద్దరి మృతదేహాలు కంటపడేసరికి తల్లడిల్లిపోయారు. పల్లం గ్రామం బోరున విలపించింది. ఇదేమీ తెలియని మృతురాలి చిన్నారి.. అందరి వైపు చూస్తుంటే.. అతడిని చూసిన అందరు.. ఉబికివస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకోలేకపోయారు. సాక్షి, కాట్రేనికోన (తూర్పు గోదావరి): పల్లం గ్రామానికి చెందిన సంగాని రామలక్ష్మి (22) కుమారుడు గీతాకృష్ణ (4)తో పాటు గోదావరి పాయలో పడి బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం ఈ గ్రామానికి చెందిన సంగాని నరసింహరాజు (చిన నరసింహులు)తో ఆరేళ్ల క్రితం రామలక్ష్మికి వివాహమైంది. వీరికి వివాహ బంధంలో ఇద్దరు పిల్లలు గీతాకృష్ణ (4) ఏడాది లోపు పాప ఉన్నారు. మృతురాలు రామలక్ష్మి సోదరుడు శేషాద్రి, ఆమె భర్త నరసింహరాజు మధ్య బుధవారం వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో రాత్రి భార్యాభర్తల మధ్య కూడా గొడవ తలెత్తడంతో విసుగు చెందిన ఆమె పుట్టింటికి వెళ్లిపోతానని, రాత్రి 12 గంటల సమయంలో కుమార్డు గీతా కృష్ణను తీసుకుని వెళ్లిపోయింది. గతంలో గొడవ పడి వెళ్లిపోయిన ఆమె బంధువుల ఇంటికి వెళ్లి ఆ తరువాత తిరిగి ఇంటి వెళ్లింది. అలాగే తిరిగి అవుతుందని అనుకున్నా.. ఆమె తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లకు వెళ్లి వెతికినా ఆమె లేకపోవడంతో పరిసరాల్లో వెతికారు. గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి బాలుడి మృతదేహం గోదావరి పాయలో కనబడింది. వినాయక నిమజ్ఙనంలో ఎవరో బాలుడు మృతి చెంది ఉంటాడనుకున్నారు. భార్య, కొడుకు కోసం వెతుకు తున్న భర్త, వారి బంధువులకు గోదావరి పాయలో బాలుడి మృతదేహం ఉన్నట్టు తెలియడంతో అక్కడికి వెళ్లి చూసి గీతకృష్ణ మృతదేహంగా గుర్తించారు. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానించి.. గాలించడంతో భార్య రామలక్ష్మి మృతదేహం కూడా బయటపడింది. వృత్తి రీత్యా మృతురాలి భర్త చేపల వేట చేస్తుంటాడు. చేపలను తక్కువ ధరకు విక్రయిస్తున్నావని రోజూ కొట్టేవాడని, అతని వేధింపులతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. కంట తడిపెట్టిన గ్రామస్తులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఏడాది పాపను ఇంటి వద్దనే వదిలి కొడుకు గీతాకృష్ణతో పాటు రామలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడటంతో పల్లం గ్రామస్తులు కంటతడి పెట్టారు. బాలుడి మృతదేహంపై పడి బంధువులు రోధిస్తున్న తీరు అందరినీ కలసి వేసింది. రోజూ అందరితో ఆడుకొనే బాలుడు మృతి చెందడంతో అతడితో ఆడుకొనే చిన్నారులు బిక్కముఖాలతో కూర్చున్నారు. ఏమి జరిగిందో తెలియని మృతురాలి ఏడాది లోపు చిన్నారి.. అక్కడి అందరినీ చూస్తూ కూర్చోవడం.. చూపరులకు దుఃఖాన్ని కలిగించింది. ఈ ఘటనపై కాట్రేనికోన ఏఎస్సై వి.నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజాసమస్యల పరిష్కారంలో సర్కారు విఫలం
కేంద్ర మాజీమంత్రి పళ్లంరాజు మండపేట : ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని కేంద్ర మాజీ మంత్రి మళ్లిపూడి మంగపతి పళ్లంరాజు విమర్శించారు. పీసీసీ అధికార ప్రతినిధి కామన ప్రభాకరరావు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నాళం వారి సత్రంలో జరిగిన జన ఆక్రోష్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పళ్లంరాజు మాట్లాడుతూ నవంబరు 8వ తేదీన పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం సామాన్యులను రోడ్డున పడేసిందన్నారు. డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజి మాట్లాడుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేసి సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దోపిడి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ అయితాబత్తుల బుచ్చిమహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ప్రజావ్యతిరేక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కామన మాట్లాడుతూ ప్యాకేజీ పేరిట చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తొలుత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిలో పార్టీ నేతలు పళ్లంరాజు, నానాజి, కామన తదితరులు ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. పార్టీ నాయకులు బోడా వెంకట్, ఎస్ఎన్ రాజా, జి. ఏడుకొండలు, నంద, వి. వీరాస్వామి, సురేష్‌కుమార్, దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం
జగ్గంపేట : రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే 90 శాతం నిధులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు అన్నారు. ప్రత్యేక హోదా, టీడీపీ ఎన్నికల హామీలపై శనివారం జగ్గంపేటలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మరోతి శివగణేష్ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. గ్రామంలో మెయిన్ రోడ్డులో పెద్దాపురం రోడ్డు శివారు నుంచి సెంటర్ వరకు పళ్లంరాజు, డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ తదితరులు ప్రజా బ్యాలెట్ ఉద్యమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అమలు కావాలా ? వద్దా ? అని, తెలుగుదేశం పార్టీ 2014ఎని్నకల మేనిఫెస్టోలో ఇచ్చిన 600లపై చిలుకు హామీలను నెరవేర్చిందా ? లేదా? అని రెండు ప్రధాన ప్రశ్నలకు తీర్పును ప్రజలను నుంచి కోరారు. అనంతరం స్థానిక సాయిబాలాజీ ఫంక్షన్ హాలులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పార్టీ «అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన జన ఆవేదన సమ్మేళనం సమావేశంలో మాజీ మంత్రి పళ్లంరాజు మాట్లాడుతూ హోదా న్యాయసమ్మతం కావడంతో పవన్‌కల్యాణ్, జగన్మోహన్రెడ్డి హోదా కావాలని కోరుతున్నారన్నారు. గతంలో దురదుష్టకరమైన సంఘటన కారణంగా బలమైన నాయకుడు రాజశేఖరరెడ్డిని కోల్పోయామన్నారు. ఆయన హయాంలో రైతుల బాగుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని, ఉపాధి పథకం ద్వారా ఎందరికో పనులు లభించాయన్నారు. ప్రస్తుతం కేంద్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా నోట్ల రద్దు చేయడం దురహంకారమని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాయవతికి పదవి దక్కకుండా ఉండేందుకేనని నోట్ల రద్దుచేశారని ఆరోపించారు. హోదా కోసం కోటి సంతకాల ఉద్యమం విజయవంతం చేయాలన్నారు. డీసీసీ అ«ధ్యక్షుడు పంతం నానాజీ, నియోజకవర్గ ఇన్చార్జి మరోతి శివగణేష్, నాయకులు వత్సవాయి బాబు, అడబాల కుందరాజు, గుల్లా ఏడుకొండలు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, మార్టన్లూథర్, బాలేపల్లి మురళి, కాకి లక్ష్మణరావు, నక్కా సత్తిబాబు, ఏబీ సుధాకర్, ముత్యాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నియంతృత్వంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ
కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు ధ్వజం కాకినాడ(కాకినాడసిటీ): నోట్ల రద్దు, ఇతర ప్రధాన అంశాల్లో ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు ధ్వజమెత్తారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం నానాజీ అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేయడం, స్వయం ప్రతిపత్తి కలిగిన ఆర్బీఐ విషయంలో మితిమీరిన జోక్యం వంటి అంశాలు ఆయన పనితీరుకు అద్దం పడుతున్నాయన్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో అక్కడి ప్రధాన రాజకీయ పక్షాలను దెబ్బ తీయడానికి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. మాజీ ప్రధానులు వాజ్పాయ్, మన్మోహన్ సింగ్, మోడిల పనితీరుపై ఓ సంస్థ చేసిన సర్వేలో అన్నింటా మోదీ ఘోరంగా విఫలం చెందినట్టు తేటతెల్లమైందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా సొంత మీడియాను అడ్డం పెట్టుకుని అబద్ధాలతో కాలం వెళ్లబుచ్చున్నారన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం నానాజీ మాట్లాడుతూ నోట్ల రద్దు పర్యవసాన పరిస్థితులపై ప్రజల తరుపున వచ్చే నెల 5 నుంచి 15వ తేదీ వరకు నియోజకవర్గాల్లో ‘జన ఆవేదన సమ్మేళనం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలపై పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. జేసీకి వినతి పత్రం... కరువు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం నానాజీ ఆధ్వర్యంలో శనివారం జాయింట్ కలెక్టర్ సత్యనారాయణను కలిసి ఆ పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా డీమోనటైజేషన్ కమిటీ ఛైర్మన్ గుల్లా ఏడుకొండలు, జిల్లా ఎస్సీ, మహిళా విభాగాల అధ్యక్షులు కాశి లక్ష్మణస్వామి, వర్థినీడి సుజాత, మైనార్టీ, కిసాన్‌సెల్ అధ్యక్షుడు జవ్వాద్ ఆలీ, గెడ్డం సురేష్‌కుమార్, వివిధ నియోజకవర్గాల ఇన్చార్జులు డాక్టర్ పాండు రంగారావు, పంతం ఇందిర, శివగణేష్, కడలి రాంపండు తదితరులు పాల్గొన్నారు.