నియంతృత్వంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ
నియంతృత్వంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ
Published Sat, Feb 25 2017 11:06 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు ధ్వజం
కాకినాడ(కాకినాడసిటీ): నోట్ల రద్దు, ఇతర ప్రధాన అంశాల్లో ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు ధ్వజమెత్తారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం నానాజీ అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేయడం, స్వయం ప్రతిపత్తి కలిగిన ఆర్‌బీఐ విషయంలో మితిమీరిన జోక్యం వంటి అంశాలు ఆయన పనితీరుకు అద్దం పడుతున్నాయన్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో అక్కడి ప్రధాన రాజకీయ పక్షాలను దెబ్బ తీయడానికి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. మాజీ ప్రధానులు వాజ్‌పాయ్, మన్మోహన్ సింగ్, మోడిల పనితీరుపై ఓ సంస్థ చేసిన సర్వేలో అన్నింటా మోదీ ఘోరంగా విఫలం చెందినట్టు తేటతెల్లమైందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా సొంత మీడియాను అడ్డం పెట్టుకుని అబద్ధాలతో కాలం వెళ్లబుచ్చున్నారన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం నానాజీ మాట్లాడుతూ నోట్ల రద్దు పర్యవసాన పరిస్థితులపై ప్రజల తరుపున వచ్చే నెల 5 నుంచి 15వ తేదీ వరకు నియోజకవర్గాల్లో ‘జన ఆవేదన సమ్మేళనం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలపై పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు.
జేసీకి వినతి పత్రం...
కరువు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం నానాజీ ఆధ్వర్యంలో శనివారం జాయింట్ కలెక్టర్ సత్యనారాయణను కలిసి ఆ పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా డీమోనటైజేషన్ కమిటీ ఛైర్మన్ గుల్లా ఏడుకొండలు, జిల్లా ఎస్సీ, మహిళా విభాగాల అధ్యక్షులు కాశి లక్ష్మణస్వామి, వర్థినీడి సుజాత, మైనార్టీ, కిసాన్‌సెల్ అధ్యక్షుడు జవ్వాద్ ఆలీ, గెడ్డం సురేష్‌కుమార్, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జులు డాక్టర్ పాండు రంగారావు, పంతం ఇందిర, శివగణేష్, కడలి రాంపండు తదితరులు పాల్గొన్నారు.
Advertisement