ప్రజాసమస్యల పరిష్కారంలో సర్కారు విఫలం
కేంద్ర మాజీమంత్రి పళ్లంరాజు
మండపేట : ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని కేంద్ర మాజీ మంత్రి మళ్లిపూడి మంగపతి పళ్లంరాజు విమర్శించారు. పీసీసీ అధికార ప్రతినిధి కామన ప్రభాకరరావు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నాళం వారి సత్రంలో జరిగిన జన ఆక్రోష్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పళ్లంరాజు మాట్లాడుతూ నవంబరు 8వ తేదీన పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం సామాన్యులను రోడ్డున పడేసిందన్నారు. డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజి మాట్లాడుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేసి సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దోపిడి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ అయితాబత్తుల బుచ్చిమహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ప్రజావ్యతిరేక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కామన మాట్లాడుతూ ప్యాకేజీ పేరిట చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తొలుత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిలో పార్టీ నేతలు పళ్లంరాజు, నానాజి, కామన తదితరులు ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. పార్టీ నాయకులు బోడా వెంకట్, ఎస్‌ఎన్ రాజా, జి. ఏడుకొండలు, నంద, వి. వీరాస్వామి, సురేష్‌కుమార్, దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.