వాతలు చూపిస్తున్న మండి కార్తీక్
బాపట్ల: అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తల్లి కుమారుడికి వాతలు పెట్టింది. కన్నకొడుక్కి అంత దారుణంగా వాతలు ఎందుకు పెట్టావంటూ ఊరి నుంచి వచ్చిన భర్త తన భార్యను నిలదీస్తుంటే, అత్త వచ్చి కర్రతో అల్లుడి తల పగలగొట్టింది. ఈ సంఘటన బాపట్ల మండలం నరసాయపాలెం లో జరిగింది. బాపట్ల ఎస్‌ఐ రవికృష్ణ కథనం ప్రకారం నరసాయపాలెంకు చెందిన మండి మణికుమార్, కళావతిలకు కార్తీక్ అనే తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. మణికుమార్ హైదరాబాద్‌లో సోలాల్ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ, వారానికి ఒకసారి నరసాయపాలెం వచ్చివెళుతుంటాడు.
కార్తీక్ తల్లి కళావతి తరచు ఓ వ్యక్తితో ఎక్కువగా మాట్లాడుతోందని గమనించి వారం రోజుల క్రితం అమ్మమ్మ సరళకు చెప్పాడు. తనపై చాడీలు చెబుతావా అంటూ కుమారుడు కార్తీక్‌కు వాతలు పెట్టింది కళావతి. హైదరాబాద్ నుంచి వచ్చిన మణికుమార్ గురువారం రాత్రి కుమారుడి చేతులపై వాతలు చూసి ప్రశ్నించగా భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలో కళావతి తల్లి సరళ వచ్చి అల్లుడిని తలపై కర్రతో బలంగా కొట్టడంతో తలకు గాయమైంది. మణికుమార్ ఫిర్యాదు మేరకు అతని భార్య కళావతి, అత్త సరళపై కేసులు నమోదు చేశారు. చికిత్స నిమిత్తం మణికుమార్‌ను గుంటూరు వైద్యశాలకు తరలించారు. కార్తీక్‌ను జిల్లా బాల,బాలికల సంరక్షణ కమిటీ వద్దకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment