ఆస్పత్రిలో అమ్మ...మార్చురీలో బిడ్డ..  | Mother in hospital..kid in hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో అమ్మ...మార్చురీలో బిడ్డ.. 

Published Wed, Mar 14 2018 7:18 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Mother in hospital..kid in hospital - Sakshi

ఆసుపత్రిలో తల్లి కమలాకుమారి...మార్చురీలో కుమారుడు లక్కీ(4)... ప్రమాదంలో మృతిచెందిన వెంకన్న(పైల్‌ ఫోటో)

గాయపడిన ఆ అమ్మ.. ఆస్పత్రిలో బెడ్‌పై ఉంది. అమ్మను చూసేందుకు వచ్చిన నాలుగేళ్ల బిడ్డడు.. శవంగా మారాడు. అసలేమైంది..? 

డ్రైవింగ్‌.. 
జాగ్రత్తగా ఉంటే.. క్షేమంగా గమ్యాన్ని చేరుకుంటాం. 
అజాగ్రత్తగా ఉంటే.. ఆస్పత్రికో, అనంత లోకానికో చేరుకుంటాం. 
ఎటు వెళ్లాలనేది.. డ్రైవింగ్‌పై ఆధారపడి ఉంటుంది. 

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. 
ప్రాణాలు తీస్తుంది(‘డై’)..! 
జీవితాలను నిస్సారం(‘డ్రై’)గా మారుస్తుంది..!! 
సరిగ్గా, ఇక్కడ జరిగిందిదే..!!! 


ఖమ్మంరూరల్‌: అసలేమైంది..? 

- ఇది తెలుసుకోవాలంటే.. నాలుగు రోజుల కిందట ఏం జరిగిందో తెలియాలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన ఆమె పేరు  కమలకుమారి. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో నర్సింగ్‌ ఎగ్జామ్‌ రాసి, కారులో తిరిగొస్తోంది. మార్గమధ్యలోగల చిట్యాలలో ఈ కారుకు ప్రమాదం జరిగింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మంలోని ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. 
- ఆమెకు నాలుగేళ్ల బుడ్డోడు (చిన్న కుమారుడు) ఉన్నాడు. వాడి ముద్దు పేరు లక్కి. తల్లిని చూడకుండా ఉండలేకపోతున్నాడు. ‘అమ్మా.. అమ్మా..’ అని కలవరిస్తున్నాడు, అమ్మ వద్దకు వెళతానంటూ ఏడుస్తున్నాడు. ఆస్పత్రిలోని ఆ తల్లి పరిస్థితి కూడా అంతే. తన ముద్దుల లక్కీని చూడకుండా ఉండలేకపోతోంది. బిడ్డడిని చూడలేని ఈ మూడు రోజులు.. ఆమెకు మూడు యుగాలుగా గడిచాయి. 
- కమలకుమారిని చూసేందుకని కుటుంబీకులైన వై.రాజేష్, హేమలత, శాంతకుమారి కలిసి ఇన్నోవాలో ఖమ్మం వచ్చారు. వస్తూ వస్తూ బుడ్డోడు లక్కీని కూడా తీసుకొచ్చారు. తల్లిని చూసిన బిడ్డడు.. బిడ్డడిని చూసిన తల్లి ఖుషీ.. ఖుషీ..! 
- సోమవారం ఉదయం వరకు ఆమె కుటుంబీకులు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆ తరువాత, వరంగల్‌ క్రాస్‌ రోడ్‌లో ఉంటున్న తమ బంధువైన రాయల రమాదేవి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. కాసేపటి తరువాత బయల్దేరారు. రాయల రమాదేవి కూడా వాహనంలో కూర్చుంది. అందరూ కలిసి తిరిగి ఆస్పత్రికి వెళుతున్నారు. 
- జలగం నగర్‌ మీదుగా ఇన్నోవా వేగంగా వెళుతోంది. సరిగ్గా అదే సమయంలో ఓ ద్విచక్ర వాహన చోదకుడు రోడ్డు దాటుతున్నాడు. ఆ ఇద్దరు డ్రైవర్లు ఏ ధ్యాసలో ఉన్నారో.. ఏ లోకంలో ఉన్నారో...! ద్విచక్ర వాహనాన్ని ఇన్నోవా ఢీకొంది.. అదుపుతప్పింది. అదే వేగంతో రోడ్డు పక్కనున్న చెట్టును గుద్దుకుంది. 
- జలగం నగర్‌కు చెందిన ఆ ద్విచక్ర వాహన చోదకుడు అయిత వెంకన్న(35), ఇన్నోవాలో ఉన్న నాలుగేళ్ల లక్కి, రాజేష్, హేమలత, శాంతకుమారి, రాయల రమాదేవి తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మంలోని ఆస్పత్రిలో చేరారు. ప్చ్‌.. అదే రోజు (సోమవారం) అర్ధరాత్రి ఆస్పత్రిలో అయిత వెంకన్న, లక్కి.. ప్రాణాలు విడిచారు.  
- తీవ్ర గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ తల్లి.. తన ముద్దుల బిడ్డడు.. తనను విడిచి ఈ లోకం నుంచి వెళ్లిపోయాడన్న భయంకర వార్తను విని తట్టుకోగలదా..? క్షతగాత్రులైన ఆమె కుటుంబీకులకు, ఇతరులకు ఇదే భయం కలిగింది. అందుకే, ఆ చేదు నిజాన్ని ఆమెకు తెలియనివ్వలేదు. 
- ప్రయివేటు ఆస్పత్రిలో మంచంపై ఆ తల్లి. ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలో ఈ బిడ్డడు. క్షతగాత్రులైన ఆ నలుగురు, ఇతర కుటుంబీకులు... ‘ఓరి దేవుడా..’ అంటూ, గుండెలవిసేలా రోదిస్తున్నారు.
- అక్కడ, అయిత వెంకన్న ఇంట విషాదం. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబీకులు కన్నీరుమున్నీ రుగా విలపిస్తున్నారు. వెంకన్నకు భార్య శ్యామల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాడ్‌ బెండింగ్‌ కార్మికుడై న వెంకన్నది నిరుపేద కుటుంబం. రెక్కలు ము క్క  లు చేసుకుంటేగానీ ఇల్లు గడుస్తుంది. ఇప్పుడు అతని  భార్యాపిల్లలు.. దిక్కు లేని పక్షులయ్యారు.
- ప్రమాద స్థలాన్ని ఖమ్మం రూరల్‌ ఏసీపీ పి.నరేష్‌ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సీఐ తిరుపతి రెడ్డి, ఎస్‌ఐ ఎం.చిరంజీవి నుంచి తెలుసుకున్నారు.
- నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అక్కడ ఆ ప్రమాదం.. ఇక్కడ ఈ ప్రమాదం. ఇద్దరిని బలిగొంది(డై). ఓ తల్లికి కడుపు కోత(డ్రై) మిగిల్చింది. ఓ ఇల్లాలిని.. ఇద్దరు పిల్లలను వీధులపాలు(డ్రై) చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement