
హత్యకు గురైన పరమేష్
సాక్షి, కర్నూలు: కల్లూరు మండలం పందిపాడు గ్రామానికి చెందిన ఆకెపోగు పరమేష్ (25) ఆదివారం దారుణహత్యకు గురయ్యాడు. వివరాలు. పరమేష్ గౌండ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తమ కాలనీకి చెందిన దేవదానంకు రూ.6 వేలు అప్పుగా ఇచ్చాడు. డబ్బులు చెల్లించాలని పరమేష్ సోదరుడు ఆటోడ్రైవర్ ఆకెపోగు శంకర్ దేవదానంతో వాదనకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దేవదానంతో పాటు కుటుంబ సభ్యులు ఏసమ్మ, రవి, నాగమణి తదితరులు ఘర్షణకు దిగడంతో పరమేష్ వారించేందుకు ప్రయత్నించగా గట్టిగా తోయడంతో రాయిపై పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు.
వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన నాలుగో పట్టణ సీఐ రామయ్యనాయుడు, ఎస్‌ఐ శేషయ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. పరమేష్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవదానం కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.