సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి కస్టడీని నాంపల్లి కోర్టు పొడిగించింది. ఈ కేసు విచారణలో భాగంగా రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్ కస్టడీ ముగియడంతో పోలీసులు శనివారం వారిని కోర్టులో హాజరుపర్చారు. నిందితులిద్దరిని మరో ఎనిమిది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు రాకేష్ రెడ్డి అక్రమాలు, సెటిల్మెంట్‌లు, బెదిరింపులు, పోలీసు అధికారులతో పాటు, రౌడీ షీటర్‌తో ఉన్న సంబంధాలు ఇలా ఎన్నో కీలక విషయాలు వెలుగు చూశాయని పోలీసులు ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ చేయడం కోసం రాకేష్ రెడ్డి కస్టడీని పొడగించాల్సిందిగా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అందుకు కోర్టు అనుమతినిస్తూ ఫిబ్రవరి 23 వరకు రాకేష్ రెడ్డితో పాటు అతడి డ్రైవర్ శ్రీనివాస్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు టీడీపీ కీలక నేతలతో రాకేష్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో రాకేష్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలిసిందన్నారు పోలీసు అధికారులు. ఈ క్రమంలో పదవులు, సీట్లు ఇప్పిస్తానంటూ పలువురు నాయకులతో రాకేష్ రెడ్డి బేరసారాలు జరిపాడని.. భారీగా నగదు చేతులు మారినట్లు గుర్తించామన్నారు. రాకేష్ వ్యవహారం బయటకు రావడంతో తమకు న్యాయం చేయాలంటూ ఆశ్రయిస్తున్నవారి సంఖ్య పెరిగిందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment