ఇటీవల కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: కొత్త పంథాలో బంగారం స్మగ్లింగ్ సాగుతోంది. విమానయానంలోని మార్పులనే స్మగ్లింగ్ ముఠా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఎయిర్‌ఇండియాకు చెందిన 952 విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖపట్నానికి అక్కడ నుంచి ఢిల్లీకి 1.224 కిలోల బంగారం అక్రమ రవాణాకు సహకరిస్తూ గత నెల 23న ఉత్తరప్రదేశ్‌వాసి కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. విచారణలో అతడు కీలకాంశాలను బయటపెట్టాడు. విదేశంలో అంతర్జాతీయ సర్వీసుగా ప్రారంభమైన విమానాలను దేశంలోకి ప్రవేశించిన తరువాత దానిని దేశవాళీ సర్వీసులుగా పలు విమానయాన సంస్థలు మార్పు చేస్తున్నాయి. డొమెస్టిక్ ట్రావెల్ కోసం టికెట్లు బుక్ చేసుకున్న, అప్పటికప్పుడు కొనుగోలు చేసిన ప్రయాణికులు అంతర్జాతీయ ప్రయాణికులతో కలిపి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీన్నే ఈ ముఠా తమకు అనువుగా మార్చుకుంది.
యూపీకి చెందిన స్మగ్లర్ 1.224 కిలోల బంగారంతో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చా డు. బంగారం ఉన్న బ్యాగ్‌ను తన సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా విమా నం దిగి కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకునేందుకు వచ్చాడు. అదే విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి అదే ముఠాకు చెందిన మరోవ్యక్తి ముందే డొమెస్టిక్ టికెట్ బుక్ చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. అతడు దేశవాళీ ప్రయాణికుడిగా ఎక్కి అంతకు ముం దు యూపీ వ్యక్తి కూర్చున్న సీటులోనే కూర్చున్నాడు. అనుకున్న ప్రకారం ఇతడు విశాఖపట్నం చేరేసరికి దేశవాళీ ప్రయాణికుడే కావడంతో ఎలాంటి కస్టమ్స్ తనిఖీలు లేకుండా అక్కడి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేయవచ్చు. అయితే యూపీవాసి శంషాబాద్ విమానాశ్రయంలోనే చిక్కడంతో స్మగ్లింగ్‌కు చెక్ పడింది.
తాజాగా మరో ‘అడుగు’...
యూపీవాసి స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో హైదరాబాద్‌కు చెందిన స్మగ్లింగ్ సూత్రధారులు ఈ పంథాలో కొన్ని మార్పులు చేశారు. తమ ముఠాకే చెందిన ఒక వ్యక్తిని గత నెల 27న ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ముంబైకి పంపారు. అక్కడ నుంచి అదేరోజు సాయంత్రం జిద్దా నుంచి వచ్చే ఏఐ 965 ఫ్లైట్‌లో ముంబై నుంచి హైదరాబాద్‌కు స్మగ్లర్‌తో కలసి ఆ వ్యక్తి డొమెస్టిక్ ప్యాసింజర్‌గా ప్రయాణించాడు. వీరిలో ఒకరికి ఇంకొకరితో పరిచయం ఉండదు. జిద్దా ప్రయాణికుడు హైదరాబాద్‌లో విమానం దిగిన తర్వాత టాయిలెట్‌లో 1.243 కేజీల బంగారం దాచి బయటకు వెళ్లిపోయాడు. అక్కడ నుంచి బంగారాన్ని ఈ ‘డొమెస్టిక్ ప్యాసింజర్’ తీసుకువెళ్లి బయట వేచి ఉండే వ్యక్తికి అప్పగించాల్సి ఉంది. అయితే, ఈ ‘డొమెస్టిక్ ప్యాసింజర్’టాయిలెట్ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడటంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టాయిలెట్‌లో దాచిన బంగారంతోపాటు పూర్తి వివరాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారం వెనుక ఉన్న హైదరాబాద్‌కు చెందిన సూత్రధారిపై కస్టమ్స్ అధికారులు దృష్టి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment