
సాక్షి, శంషాబాద్: అక్రమంగా తరలిస్తున్న 4 కేజీల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. ఇందులో ఎయిరిండియా ఉద్యోగి హస్తం ఉందని గుర్తించారు. దుబాయ్ నుంచి తీసుకొచ్చిన ఈ బంగారాన్ని ఎయిరిండియా ఉద్యోగి ద్వారా మరో ఇద్దరు వ్యక్తులు బయటికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ముందస్తు సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు మంగళవారం తెల్లవారుజామున విమానాశ్రయం ప్రాంగణంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి టేపులతో చుట్టి ఉన్న రెండు పార్శిళ్లను తెరిచి చూడగా అందులో 4.194 కేజీల బరువున్న 36 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.కోటీ 34 లక్షల వరకు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. వీటితోపాటు నిందితుల వద్ద పట్టుబడిన 3.60 లక్షల భారత కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఎయిరిండియా ఉద్యోగితోపాటు మరో ఇద్దరు ఉన్నారు. వీరిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత మూడు నెలల కిందట కూడా ఎయిరిండియాకు చెందిన ఓ ఉద్యోగి అక్రమంగా బంగారాన్ని రవాణా చేయడంలో మధ్యవర్తిగా పనిచేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా పట్టుబడిన అక్రమ రవాణాలో కూడా ఎయిరిండియా ఉద్యోగి పాత్ర ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment