
విలపిస్తున్న తల్లి స్టెల్లా, అత్తమామలు విజయలక్ష్మీ, చిత్తరాజు
కొందరికి మమత, మానవత కంటే పరువు ప్రతిష్టలే ఎక్కువైపోతున్నాయి. పరువు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. సంతోషంగా సాగిపోతున్న కొడుకు కోడలును చూసి ఆనందించాల్సిన అత్తమామలు.. పగ పెంచుకుని రగిలిపోయారు. తమ మాట కాదని ప్రేమ పెళ్లి చేసుకున్నాడని కుతకుతలాడిపోయారు. మానవత్వం మంట గలిసేలా మనవడిని చంపడానికీ వెనుకాడలేదు. దీంతో కవల బిడ్డల్లో ఒకరికి నెలరోజులకే నూరేళ్లు నిండాయి. ఈ అమానుషం ఎక్కడో కాదు, సిలికాన్ నగరంలోనే జరిగింది.
కృష్ణరాజపురం: తన భర్త తల్లిదండ్రులు, మరిది కలిసి తన చిన్నారి కొడుకును గొంతుపిసికి హత్య చేశారని స్టెల్లా అనే యువతి బెంగళూరు అశోక్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు.. నీలసంద్రకు చెందిన చిత్తరాజు, విజయలక్ష్మీ దంపతులకు కార్తీక్, అరవింద్ అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్దకొడుకైన కార్తీక్ అదే ప్రాంతానికి చెందిన స్టెల్లా అనే యువతి ప్రేమించుకున్నారు. కార్తీక్ తల్లిదండ్రులు వీరి ప్రేమను నిరాకరించినప్పటికీ, కొద్దికాలం క్రితం పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. కార్తీక్ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటి ఎదురుగానే బాడుగ ఇంట్లో కాపురం పెట్టాడు. వీరికి నెల కిందటే ఇద్దరు మగ కవల పిల్లలు జన్మించారు. తమకు ఇష్టం లేని పెళ్లిని చేసుకోవడంతో పాటు తమ కళ్ల ఎదుట ఇద్దరూ అన్యోన్యంగా ఉండడాన్ని చిత్తరాజు, విజయలక్ష్మిలు జీర్ణించుకోలేకపోయారు.
దీంతోపాటు తనకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో వారి రెండవ కుమారుడు అరవింద్ కూడా అన్న వదినలపై పగ పెంచుకున్నాడు. కక్ష తీర్చుకోవడానికి కుట్రలు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలంటూ తరచూ కార్తీక్, స్టెల్లాతో ముగ్గురూ గొడవ పడుతుండేవారు. అయినప్పటికీ వారు బెదరకపోవడంతో మరింత రగిలిపోయిన ముగ్గురూ.. ఏదో ఒకటి చేసి కక్ష తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు. అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్న ముగ్గురూ ఈ నెల 21వ తేదీ కార్తీక్ ఇంట్లో లేకపోవడాన్ని గమనించి తమ పథకాన్ని అమలు చేయడానికి ఉపక్రమించారు. పెళ్లయిన రోజు నుంచి ఎప్పుడూ స్టెల్లాతో మాట్లాడని విజయలక్ష్మి.. వారి ఇంటికి వెళ్లి ప్రేమగా మాట్లాడుతున్నట్లు నటించింది.
చిన్నారి గొంతుకు టవల్ బిగించి..
కవలల్లో్ల ఒకరికి జ్వరం రావడంతో కార్తీక్ మందులు తేవడానికి అప్పుడు బయటికి వెళ్లి ఉన్నాడు. మరో గదిలో ఉన్న జ్వరం వచ్చిన పసిబిడ్డ వద్దకు స్టెల్లా వెళ్లగా, సమయం కోసం ఎదురు చూస్తున్న విజయలక్ష్మి హాల్లో ఆడుకుంటున్న మరో బిడ్డను టవల్‌తో గొంతునులిమి చంపి, మంచం కింద దాచేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్ది సేపటికి హాల్లోకి వచ్చి చూడగా బిడ్డ కనిపించకపోవడంతో స్టెల్లా వెంటనే భర్త కార్తీక్‌తో కలసి అత్తమామలు,మరిదిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్‌నగర్ పోలీసులు స్టెల్లా అత్తమామలు,కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారించగా బిడ్డ మృతదేహం బయటపడింది. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment